కాకినాడ రూరల్: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడాన్ని చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారారని చెప్పారు. నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల చులకన భావాన్ని ప్రదర్శిస్తూ.. చెడుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన్ను ఎలాగైనా అణగదొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్రలు చేశారని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
నాడు కుట్ర చేసి ఇరికించారు..
► ‘సాక్షి’లో కొన్ని సంస్థలు రాజమార్గంలో సుమారు రూ.1200 కోట్లు పెట్టుబడులు పెడితే, ఇదంతా అక్రమమన్నట్టు చిత్రీకరించారు. ఆనాడు కాంగ్రెస్‌తో లోలోన కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించారు. ఇన్‌కమ్ ట్యాక్స్, ఈడీ వంటి వాటిని ప్రయోగించి రాజకీయంగా పైకి రానివ్వకూడదని అణిచివేతకు లేనిపోనివి సృష్టించారు. అయినా వైఎస్ జగన్ దేనికీ వెన్ను చూపలేదు.
► ఈ నేపథ్యంలో సాక్షిలో పెట్టుబడులన్నీ సక్రమమేనని, ఏవీ దొడ్డి దారిన రాలేదని ఇటీవల ఇన్‌కం ట్యాక్స్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు కంట్లో నుంచి రక్తం కారుతోంది. విపరీతంగా బాధ పడుతున్నాడు. ఆయనకు నిద్ర కరువైంది. చివరికి న్యాయ వ్యవస్థను తప్పు పట్టేలా తయారయ్యాడు.
► 2008లోని ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏమిటో బయటపడ్డాయి. అందుకే కేసులు ఒక్కొక్కటిగా నీరుగారి పోతున్నాయి. లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి అని చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు చేసింది. అభియోగం లక్ష కోట్లు కాదని, కేవలం రూ.1,200 కోట్లు మాత్రమేనని అప్పటి దర్యాప్తు అధికారి జేడీ లక్ష్మినారాయణ ఇటీవల చెప్పారు. ఇప్పుడు ఇది కూడా తేలిపోవడంతో బాబుకు నిద్ర రావడం లేదు.
► ఆ నాడు సాక్షిలో పెట్టుబడులపై ముందుగా ఐటీని పంపించారు. ఆ పెట్టుబడులు సక్రమం కాదని దుర్మార్గమైన ఆర్డర్ ఇప్పించారు. దీని వెనక ఎవరు ఉన్నారో మనందరికీ తెలుసు. ఎందుకు సాక్షిని టార్గెట్ చేశారనేదీ అందరికీ తెలుసు. సాక్షిని దెబ్బతీస్తే జగన్ వాయిస్ బయటకు రాకుండా చేయొచ్చని వాళ్ల నమ్మకం.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట
► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే హెరిటేజ్ షేర్ ఎందుకు పెరిగింది? ఆయన అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ షేర్‌లు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. 2004లో చంద్రబాబు అధికారం నుంచి దిగే నాటికి షేర్ విలువ రూ.13 నుంచి 14 వరకు ఉండేది. 2014లో అధికారంలోకి వచ్చాక రూ.100 వరకు పెరిగింది. దీనికి బాబు ఏమని సమాధానం చెబుతారు?
► చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 ఆయన బలం. అయితే జనబలం ముందు ఆ బలం సరిపోక చతికిలపడ్డారు.
► చంద్రబాబు అవినీతి గురించి అందరికీ తెలుసు. ఏలేరు నుంచి అమరావతి వరకు ఎన్ని స్కామ్‌లు చేశారో కూడా తెలుసు. ఏలేరు స్కామ్‌ను బయటకు తీసింది నేనే (రిపోర్టర్‌గా ఉన్నప్పుడు). ఈ స్కామ్‌పై అప్పట్లో చంద్రబాబును 6 గంటల పాటు విచారిస్తే ఆయన అనుకూల పత్రికలు ఎంతో బాధపడ్డాయి.
► ఉద్యోగులపై చంద్రబాబుకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు. అలాంటి బాబు ఇవాళ పీఆర్సీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగులపై ఎంత గౌరవముందో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ చిట్‌చాట్ బట్టబయలు చేసిన విషయం అందరికీ తెలుసు.
►ఇతర సిమెంట్ కంపెనీలతో పాటే భారతీ సిమెంట్ కూడా బస్తా రూ.230 చొప్పున ప్రభుత్వానికి ఇస్తున్న విషయం బాబుకు తెలియదు కాబోలు. ఇవాళ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలతో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. చంద్రబాబూ.. మీ మాటలు ఎవరూ నమ్మరు. ఇప్పటికైనా మారండి.
చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment