
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. నిజంగా రేవంత్‌కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీని అడిగి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా?. హామీల, పథకాల అమలు విషయంలో మాపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. దమ్ములేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా?. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా? అని ప్రశ్నించారు.

అంతకుముందు, ప్రధానితో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment