సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అదానీ అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని నేడు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర నేతలతో ప్రధాని మోదీ చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అభివృద్ది విషయంలో సానుకూల ధోరణితో పని చేయాలన్నారని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారు. నాది బీజేపీ డీఎన్ఏ.. మీలాగా పది పార్టీలు మారిన డీఎన్ఏ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా సీఎం రేవంత్, విపక్షాలను తిట్టే బదులు పాలనపై దృష్టి పెట్టాలి.
విషాహారం తిని విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందూ దొందే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదే సమయంలో అదానీ అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అదానీ అంశంలో అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదానీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. మా దేశంపై ఎలా ఆరోపణలు చేస్తారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment