సాక్షి, హైదరాబాద్: దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏ పథకాలను అమలు చేశారో చెప్పాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే ఏ రాష్ట్రంలో, ఎన్ని లక్షల మంది రైతులకు లాభాల పంట పండి వారి ఆదాయం రెట్టింపు అయిందో చెప్పాలన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రచార పోస్టర్‌లో ఉన్న రైతు ఓ మోడల్ అని నెటిజన్లు తేల్చారని కేటీఆర్ గుర్తుచేశారు.
నిజంగానే మోదీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే ఆ విషయాన్ని అసలైన రైతులతో చెప్పించాలి కదా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం నకిలీ వార్తలతో దేశ ప్రజలను మోసం చేస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్న విషయాన్ని ఉటంకించారు.
ఇదేనా మీ భాష?
పార్లమెంటులో మాట్లాడకూడని పదాల (అన్‌పార్లమెంటరీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చిన దేశ ప్రజలను ‘ఆందోళన్ జీవి’అని సాక్షాత్తు ప్రధాని మోదీ అనొచ్చు. ‘గోలీ మారో సాలోం కో’అని ఒక కేంద్ర మంత్రి రెండు వర్గాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టొచ్చు. అధికారం కోసం సమాజంలో చీలిక తెచ్చేలా ‘80–20’అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు.
జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే ఏం ఫర్వాలేదు. దేశానికి అన్నం పెట్టే రైతులను ‘టెర్రరిస్టులు’అని పిలిస్తే కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓకే. ఇవన్నీ బీజేపీ సారథ్యంలోని కేంద్రంలో పనిచేస్తున్న నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్ (ఎన్‌పీఏ) ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన పదాలు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment