ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన స్వామీజీలతో సంబంధం లేదని చెప్పిన వారు కేసును సీబీఐకి అప్పగించడంతో ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారు? గతంలో సీబీఐ విచారణకు నిందితులు భయపడే పరిస్థితి నుంచి బీజేపీ హయాంలో సంబురాలు చేసుకునే స్థితికి చేరారు.
– కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలనే హైకోర్టు తీర్పుతో బీజేపీ ముసుగు తొలగిందని, దొంగలు తమ రంగులు బయటపెట్టుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పును ‘బీజేపీ విజయం’ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సంబు రాలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన స్వామీజీలతో సంబంధం లేదని చెప్పిన వారు సీబీఐకి అప్పగించడంతో ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
నిందితులను భుజాలపై మోస్తూ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ.. తమ జేబు సంస్థకు కేసు చిక్కడంతో పట్టలేనంత సంతోషంతో ఉందన్నారు. గతంలో సీబీఐ విచారణకు నిందితులు భయపడే పరిస్థితి నుంచి బీజేపీ హయాంలో సంబురాలు చేసుకునే స్థితికి చేరిందని చెప్పారు.
కెమెరాల సాక్షిగా దొరికిన దొంగలు
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయ త్నిస్తూ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన దొంగలుగా బీజేపీని కేటీఆర్ అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పేరొందిన సీబీఐని ప్రస్తుతం సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తుతోపాటు ఈ కేసులో దొరికిన దొంగలపై నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు బీజేపీ నేతలు సిద్ధమా అని సవాలు చేశారు.
నిందితులకు లై డిటెక్టర్ పరీక్షలు చేస్తే బీజేపీ నేతలతో ఉన్న సంబంధం తేటతెల్లం అవుతుందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొనుగోలు చేసి విపక్ష పార్టీల ప్రభుత్వాలను బీజేపీ కూల్చి వేస్తోందన్నారు. ఆపరేషన్ లోటస్ బెడిసి కొట్టడంతో బీజేపీ నేతలు దొంగల్లా అడ్డంగా దొరికిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment