సాక్షి, అమరావతి: గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌లో ఏపీ వ్యవసాయ శాఖ ముందు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం చూపిన ప్రగతి దేశంలో ఎక్కడా లేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతు భరోసా కింద రూ.1036 కోట్లు రైతుల అకౌంటులో వేశారన్నారు. గతంలో క్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించే వారు.. కానీ తాము లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నామని పేర్కొన్నారు. అటవీ, దేవాదాయ భూములు సాగుచేసే రైతులకు కూడా సాయం అందిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరన్నారు. చెప్పిన దాని కన్నా ఎక్కువగా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. తొలుత 45 లక్షల రైతులకు ఇస్తే.. ప్రస్తుతం 50.58 లక్షల మందికి ఇస్తున్నామని.. ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్?
‘‘రైతులకు సేవ చేసేందుకు సీఎం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గ్రామ స్థాయిలో మనం ఏర్పాటు చేసిన ఆర్బీకేలు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసిస్తున్నాయి. ఈ ఆర్బీకేలు అర్బన్ ప్రాంతంలోనూ అవసరమని కోరుతున్నారు. అది కూడా పరిశీలిస్తున్నాం. అందువల్లే పెద్దఎత్తున వ్యవసాయ రంగంలో అభివృద్ది కనిపిస్తోందని’’ కన్నబాబు అన్నారు.
రాజకీయం కోసమే విమర్శలు..
‘‘రాజకీయం కోసం కొంత మంది విమర్శలు చేస్తూనే ఉంటారు. మేము రైతు భరోసా లాంటి ఏ పెద్ద కార్యక్రమం చేసినా దాన్ని పక్కదోవ పట్టించడానికి ఏదో ఒక రాతలు రాస్తూనే ఉన్నారు. బోర్ల కింద వరి కంటే అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించండి అని మేము సలహా మాత్రమే ఇచ్చాం. అసలు వరి పండించవద్దని మేము చెప్పినట్లు చంద్రబాబు వక్రీకరించారు. చంద్రబాబు కడుపు మంటని అర్థం చేసుకుంటాం. కానీ పచ్చ పత్రికలు కూడా అదే పని చేస్తున్నాయి. చెప్పిన దానికన్నా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం మాది’’ అని కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment