సాక్షి, అమరావతి: చంద్రబాబు పక్కనున్నోళ్లంతా అభివృద్ధి నిరోధకులేనని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి నారాయణ స్వామి మాట్లాడారు. చంద్రబాబుల హయాంలో ఏ దళిత నేతకైనా డిప్యూటీ సీఎం పదవిచ్చావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు పెత్తందార్లకు ప్రతినిధులని ఎద్దేవా చేశారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దబిడ్డ వైఎస్ జగన్ అని తెలిపారు. ఎల్లోమీడియాకు బుద్ధిచెప్పే బాధ్యతను ప్రజలే తీసుకుంటారని అన్నారు.
ఇంకా ఏమన్నారంటే..
ఎర్రచందనం స్మగ్లర్లంతా చంద్రబాబు మనుషులే
దొంగే ..దొంగా దొంగా అని అరిచిన చందంగా ఎర్రచందనం స్మగ్లర్లకు నాయకుడైన చంద్రబాబు.. మా పార్టీ నేతల్ని విమర్శిస్తున్నారు. గతంలో టీడీపీ నాయకులే ఎర్రచందనం దుంగల్ని హెరిటేజ్ వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడటం నిజం కాదా..? నువ్వు అధికారంలో ఉండగానే నారావారి పల్లెలో ఎర్రచందనం దుంగల్ని పట్టుకున్నది నిజం కాదా..? మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్‌కుమార్ రెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లరని నువ్వే ప్రతీ మీటింగ్‌లోనూ చెబుతావు కదా..? మరి, ఇప్పుడు నీ పార్టీకొచ్చాక ఆయన మంచోడై పోయాడా...? స్మగ్లింగ్, దోపిడీల్లో నిన్ను మించినోళ్లు ఎవరూ లేరనేది వాస్తవం.
కుంభకోణాలతో రూ. కోట్లు కొల్లగొట్టాడు
చంద్రబాబు రాజకీయ జీవితమంతా దోచుకోవడం, దాచుకోవడమే.. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాలకు తెరదీసి రూ. కోట్లు కొల్లగొట్టాడు. హైదరాబాద్‌లో రూ.600 కోట్లతో నువ్వు ప్యాలెస్ కట్టుకోలేదా..? అమరావతి కేపిటల్ పేరుతో భూకుంభకోణానికి తెరదీసి.. ఇన్నర్‌రింగ్‌రోడ్ మాయలో కోట్లు కొట్టేసి, స్కిల్ స్కామ్‌లోనూ ప్రభుత్వ ఖజానా సొమ్మును కాజేసింది నువ్వుకాదా..? నీ మీద కేసులు పడితే కోర్టులకెళతావు. స్టేలు తెచ్చుకుంటావు. అలాంటి మోసగాడివి నువ్వు చంద్రబాబు. నన్ను, మా పార్టీ నేతల్ని విమర్శించే అర్హత నీకు లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గానికీ.. చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఏం చేశావో చెప్పుకునే దమ్ముందా..?
ఎస్సీని డిప్యూటీ సీఎం చేసిన మహానుభావుడు జగన్
ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ సమానత్వం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీస్సులతో ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న నేను డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాను. మరి, నువ్వు నీ హయాంలో ఏ దళిత నేతకు డిప్యూటీ సీఎం పదవిచ్చావు..? నా నియోజకవర్గంలో ప్రజలకు నవరత్నాల పథకాల సంక్షేమాన్ని అందిస్తూనే.. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నేను చూపించాను. రెండు 50 పడకల ఆస్పత్రులు పెట్టించాను. రూ.250 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణం చేయించాను. దాదాపు 80 ఏళ్లుగా జీర్ణోద్ధారణకు నోచుకుని దేవాలయాల్ని కూడా నేనొచ్చాక వాటిని మరలా అభివృద్ధి చేశాను. అలాంటి నన్ను విమర్శిస్తారా..? ఒక మహోన్నత వ్యక్తిగా అంబేద్కర్ ఆశయాలతో నడుస్తోన్న జగన్ గారి నేతృత్వంలో నేను డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నానంటే చాలా గర్వపడుతున్నాను. చంద్రబాబూ.. నీకు నేను సవాల్ చేస్తున్నాను. నువ్వొస్తే.. నేను చేసిన నా నియోజకవర్గ అభివృద్ధిని చూపిస్తానని సవాల్ విసురుతున్నాను.
చంద్రబాబు పక్కనున్నోళ్లంతా అభివృద్ధి నిరోధకశక్తులే
నిత్యం అబద్ధాల్ని వల్లె వేస్తూ ఏమీ చేయకున్నా చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్న చంద్రబాబును ప్రజలు 2019లోనే తిరస్కరించి మూలనబెట్టారు. ఆయన బతుకంతా అబద్ధాల ప్రపంచమేనని చిన్న పిల్లోడిని కదిలించినా చెబుతాడు. చంద్రబాబు అబద్ధాలతో పుట్టి.. అబద్ధాలతో బతికి.. అబద్ధాలతోనే చివరికి చనిపోతాడేమో.. గతంలో ఆయన అధికారంలో ఉండగా ప్రజలకు చేసిన మేలు ఏదీ లేనందునే .. ఇప్పుడు చెప్పుకోలేక పోతున్నాడు. పైగా, ఆయన చెప్పిన అబద్దాల్నే మళ్లీ మళ్లీ చెబుతుండటం కూడా ప్రజలకు పూర్తిగా అర్ధమైంది. కనుకే, టీడీపీ రా.. కదలి రా.. సభలకు ప్రజల స్పందన కరువైంది. ఆయనతో తిరిగే వారంతా అభివృద్ధి నిరోధకులేనని చెప్పుకోవాలి.
ఎల్లో మీడియాకు బుద్ధిచెప్పే బాధ్యత ప్రజలే తీసుకుంటారు
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లు పెత్తందార్లకు ప్రతినిధులే.. కాబట్టే, పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని పదేపదే తప్పుబడుతున్నారు. అదే జగన్ గారు పేద కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దబిడ్డగా పేరుతెచ్చుకుంటున్నారు. అయితే, ఎల్లోమీడియా మాత్రం పనిగట్టుకుని ఈ ప్రభుత్వం మీద పదేపదే బురదజల్లుతుంది. ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5లు కూడా చంద్రబాబు పక్కనజేరి అబద్ధాల్ని ప్రచారంలోకి తెస్తున్నారు. పనిగట్టుకుని మరీ లేనివాటిని కల్పన చేస్తూ జగన్ గారి కుటుంబంలోనూ చిచ్చును రాజేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా .. జగన్ గారు మాత్రం ఎక్కడా స్పందించకుండా, సింహంలా ఉన్నారు. పేదవాడి తలరాతను మార్చే బాధ్యతను అలుపెరుగని వీరుడిలా జగన్ గారు నెరవేరుస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆయనకు నీరాజనాలు పలుకుతుంటే.. ఈ ఎల్లోమీడియా మాత్రం చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన పక్కన తిరిగే పవన్‌కళ్యాణ్‌కు.. ఈ ఎల్లోమీడియాకు తగిన బుద్ధి చెప్పే బాధ్యతను ప్రజలే తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment