ప్రతిపక్ష హోదాపై పచ్చ కుట్ర
చట్టంలో లేకున్నా.. 10% షరతులు
పంతం పట్టి హోదా దక్కనీయకుండా వ్యూహాలు
పయ్యావుల వ్యాఖ్యలతో బట్టబయలైన పన్నాగం
అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమానించిందే జరుగుతోంది. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అణగదొక్కాలని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర.. సాక్షాత్తూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది.
వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మంగళవారం వైఎస్ జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో ఎన్నో కీలకాంశాలను ప్రస్తావించారాయన. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాల్ని సైతం ఆయన ఉటంకించారు. అయినప్పటికీ.. ప్రతిపక్ష హోదాను వైఎస్సార్‌సీపీకి దక్కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మీడియా స్పందించాలని కోరింది. దానికి పయ్యావుల వివరణ ఇస్తూ.. "అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కే అవకాశమే లేదని" అన్నారు. అంతేకాదు ఆయన ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. పైగా "స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ" వెటకారంగా మాట్లాడారు.
దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశాన్ని గనుక పరిశీలిస్తే.. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12-బీ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించిందని లేఖలోనే స్పష్టం చేశారు.
ఇక.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ పరిధిలోని అంశం. జగన్ రాసిన లేఖపై ఇంకా స్పీకర్ నుంచి బదులు రాలేదు. ఈలోపే పయ్యావుల, వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా.. అసలు వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేటతెల్లమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment