తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్
తనపై సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ దు్రష్పచారంపై మంత్రి ఆగ్రహం
క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు.
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేరకు నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఆమె ఈ నోటీసులు పంపించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో– ఇసుకాసుర రాజ్యం’అంటూ సీఎం, సీతక్కతో పాటు మంత్రులపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఆ మేరకు అరోపణల వీడియో అసత్యమని అంగీకరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేయాలని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ నోటీసులకు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 24న బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపించినట్టు మంత్రి తరఫు న్యాయవాది నాగులూరు కృష్ణకుమార్ తెలిపారు.
ఈ మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో సీతక్కతో సీఎం, కేబినెట్ మంత్రులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్టుగా చూపడాన్ని తప్పు బట్టారు. పనిగట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలతో చేస్తున్న దు్రష్పచారంతో తమ క్లయింట్, మంత్రి సీతక్క ప్రతిష్టకు తీరని విఘాతంతోపాటు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఓటర్లలో ఆమెకున్న ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment