‘పచ్చ’చొక్కా వాళ్లొస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలన్న మంత్రి అచ్చెన్న
అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు
చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక
నర్సీపట్నం నడిరోడ్డులో మున్సిపల్ అధికారులపై ‘అయ్యన్న’ దుర్భాషలు
స్పీకర్ అవుతున్నా.. అసెంబ్లీలో నిలబెడతానంటూ చిందులు
పోలీసులను గత ప్రభుత్వ తొత్తులుగా అభివర్ణించిన హోం మంత్రి అనిత
ఉద్యోగులపై మంత్రులు, టీడీపీ నేతల దుర్భాషలు..
శ్రీకాకుళం, సాక్షి, అనకాపల్లి, సింహాచలం: కొత్త అసెంబ్లీ ఇంకా కొలువుదీరలేదు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తి కాలేదు. కొందరు టీడీపీ ప్రజా ప్రతినిధులు నిజ స్వరూపాలు అప్పుడే బయ టపడుతున్నాయి. బూతు భాష, బెదిరింపుల్లో పోటాపోటీగా దూసుకెళుతున్నారు. ఉన్నత పద వుల్లో ఉన్నప్పుడు హుందాగా నడుచుకోవాలనే విషయాన్ని విస్మరించి తమ అధినేత ప్రశంసల కోసం తహతహలాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. టీడీపీ కార్యకర్తలంతా పసుపు బిళ్లలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటూ ఉపదేశించారు. వారికి కుర్చీలేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి పనులు చేయాని అధికార యంత్రాంగాన్ని బెదిరించారు.
పోలీసుల్లో గత ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించిన వారు స్వయంగా తప్పుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరికలు జారీ చేశారు. నర్సీపట్నంలో నాసిరకంగా రోడ్లు నిర్మించారంటూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మునిసిపల్ అధికారులపై నడిరోడ్డులో పచ్చి బూతులతో రెచ్చిపోయారు. త్వరలో తాను స్పీకర్ అవుతున్నానని, ఇలాంటి రోడ్లు వేసినందుకు మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్దీ నిలబెడతానని హెచ్చరించారు. అయ్యన్న తిట్ల దండకానికి నిశ్చేష్టులైన అధికారులు చుట్టూ ప్రజలంతా చూస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
లైన్‌లో పెడతా: మంత్రి అచ్చెన్న
‘నేను మాటిస్తున్నా. అధికారులకు సమావేశం పెట్టి చెబుతా. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్‌ఐ దగ్గరకు వెళ్లినా.. ఎమ్మార్వో, ఎండీఓ వద్దకు వెళ్లినా.. ఏ ఆఫీసుకు వెళ్లినా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పనేమిటి? అని అడిగి అందరికీ పనులు చేసే విధంగా అధికారులను లైన్‌లో పెడతా. ఎవరైనా నా మాట జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పాల్సిన అవసరం లేదు’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం రాత్రి ఓ సభలో వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలసి శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి, టీ ఇచ్చి గౌరవించాలని ఆదేశించారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ క్యాడర్ ఎన్నో అవమానాలకు గురైందన్నారు. ఏ పనిమీద వెళ్లినా అధికారులు, ఉద్యోగులు పట్టించుకోలేదని చెప్పారు. ఎంపీగా రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలుగా తనతో పాటు బెందాళం అశోక్ బాబు ఉన్నా తమను పట్టించుకోకుండా అవమానించారన్నారు. ఇకపై అలా జరగకుండా ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అప్పట్లో అవమానించి పనులు చేయని వారి వద్దే గౌరవం పొందాలని, పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఈ విషయంలో అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఏ అధికారి, ఉద్యోగి ఎలా పని చేశారో తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. కాగా, వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వారిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి, తమను కలవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. తమకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ మంగళవారం తనను కలసిన కొందరు వలంటీర్లనుద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.
తమాషాలు చేస్తున్నారా..
‘తమాషాలు ...(బూతు)? ఇష్టం లేకపోతే ...(బూతు)’ అంటూ మున్సిపల్ అధికారులపై నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నడిరోడ్డు మీద బూతులతో రెచ్చిపోయారు. ‘నేను అసెంబ్లీ స్పీకర్‌ను అవుతున్నా.. మిమ్మల్ని గంటల కొద్దీ నిలబెడతా..’ అంటూ పరుష పదజాలంతో దుర్భాషలాడారు. ‘కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడకల్లారా!’ అంటూ నోరు పారేసుకున్నారు. ‘నర్సీపట్నంలో దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఒకడున్నాడు. వాడి సంగతి తేలుస్తా’ అంటూ చిందులు తొక్కారు. మంగళవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని అబిద్ సెంటర్‌లో ఇటీవల నిర్మించిన వంద అడుగుల మెయిన్ రోడ్డు, ఆరిలోవ అటవీ ప్రాంతం వద్ద నర్సీపట్నం–కేడీపేట రోడ్డును పరిశీలించిన క్రమంలో అయ్యన్న బూతు పురాణానికి అధికారులు నిశ్చేష్టులయ్యారు.
నా కొడకల్లారా.. కళ్లు మూసుకున్నారా?
నాణ్యత లేకుండా రోడ్డు ఎలా వేస్తారంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమాషాలు చేస్తున్నారా..? కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారా.. నా కొడకల్లారా..’ అంటూ బూతులతో విరుచుకుపడ్డారు. పని చేయడానికి ఇష్టం లేకపోతే.. పోండి అంటూ గద్దించారు. ఆర్‌అండ్‌బీ రోడ్డుకు మున్సిపాలిటీ నిధులను వినియోగించటంపై అధికారులను ప్రశ్నించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేదని.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయడం తథ్యమన్నారు. అప్పటి ఎమ్మెల్యే ఒత్తిడితో ఎన్నికల కోసం ఈ రోడ్డు వేశారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ తొత్తులు తప్పుకోండి..
కొందరు పోలీసులు వైఎస్సార్‌సీపీ తొత్తులుగా పని చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఖాకీ చొక్కా వదిలిపెట్టి వైఎస్సార్‌సీపీ కండువా వేసుకునేందుకు కూడా కొంత మంది పోలీసులు సిద్ధమయ్యారన్నారు. అలాంటి పోలీసులకు తాను హెచ్చరికలు జారీ చేస్తున్నానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ రక్తం ఇంకా మీలో ప్రవహిస్తోందన్న ఫీలింగ్ ఉంటే మీ అంతట మీరే తప్పుకోవాలని పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటనపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment