సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటన ఆయన మనస్తత్వాన్ని సూచిస్తోంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో, ఎందుకు ఆయనకు అంత ఆత్రమో ఆయనే వివరణ ఇవ్వాలి. 9 అంశాల ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అన్న ప్రకటన కూడా చేయకపోవడం, చంద్రబాబు మొహం మాడిపోవడం చూస్తే బీజేపీలోని టీడీపీ వర్గం, ప్రత్యేకించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్పించారని స్పష్టమవుతుంది.
చదవండి: (చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్)
అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు?. ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు.
వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని వెంటనే జీవీఎల్ రంగంలోకి దిగడం, ఆ వెంటనే బహిరంగంగా ప్రకటనలు చేయడం, ఆపైన కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా మారిపోవడం ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మౌనం ఇవన్నీ చూస్తుంటే... ఏం జరిగి ఉంటుందో అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. చంద్రబాబు శకుని పాత్రపై, ఆయన పంపించిన మనుషుల శకుని పాత్రపై, పరిధులు మీరిన జీవీఎల్ ప్రకటనపై కచ్చితంగా చర్చ జరగాలి' అని అంబటి రాంబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment