కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత హరీశ్ లేఖ
హామీలిచ్చి అమలును విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే!
పార్టీ మారితే పదవి పోయేలా చట్టం చేస్తామనడం హాస్యాస్పదం
నైతికత, పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ ప్రకటనలు సిగ్గుచేటు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో మేని ఫెస్టోల పేరిట ప్రజలను మోసం చేయొద్దని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. పార్టీని మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్ప దమని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ఉద్దేశించి శుక్రవారం హరీశ్‌రావు లేఖ రాశారు. ‘ఉమ్మడి ఏపీలో 2004, 2009 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా అమలు చేయలేదు. అదే తరహాలో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేకమార్లు మాట తప్పి ఏ ధైర్యంతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎన్ని సార్లైనా మోసం చేయొచ్చనే మీ ధైర్యానికి..
‘రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్ లోని 13వ పాయింట్ కింద ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే, ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని తాజా మేనిఫెస్టోలో హామీనిచ్చారు. కానీ తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికే ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో చెప్పిన నీతులకు, అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదు.
ప్రజలను ఎన్నిసార్లైనా మోసం చేసి గెలవవచ్చు అనే మీ మొండి ధైర్యానికి ఆశ్చర్యం కలుగుతోంది’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా కూడా ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించే పత్రంపై మీ సంతకాలు చేసినా ఆ హామీలేవీ రాష్ట్రంలో అమలు కావడం లేదు’ అని ఆరోపించారు.
మీకు కొత్తహామీలిచ్చే హక్కు లేదు
‘మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహా మోసం తలపెట్టింది. రైతులను దగా చేసి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచింది. రూ.2లక్షల రుణమాఫీపై తుక్కుగూడ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుల పక్షాన కోరుతున్నాను. ఎకరాకు రూ.15వేల రైతుబంధు సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనే బోగస్ మాటలతో మీ పార్టీ తమాషా చేస్తోంది. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇలా ప్రతీ హామీ బూటకమని తేలింది.
మీ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లోనే 210 మంది రైతులు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలుకావడానికి కారకులైన మీరు, మీ పార్టీ క్షమాపణలు చెప్పాలి. హామీల అమలులో శ్రద్ధ లేని మీకు మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగవు’ అని హరీశ్‌రావు తన లేఖలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment