సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుమారం కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి జగ్గారెడ్డి రాసిన లేఖ మీడియాకు లీకవడంపై పార్టీలో అంతర్గతంగా రచ్చ అవుతోంది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనని, జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తార ని వార్తలు ఓ వైపు.. అసలు రేవంత్‌నే క్రమశిక్షణ కమిటీకి ముందుకు పిలవాలన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు మరోవైపు పార్టీలో మంటలు రేపుతున్నాయి.
అసలేం జరిగింది?:
రైతులతో రచ్చబండ కార్యక్రమంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు మొదలైంది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లికి వెళ్తానని రేవంత్ ప్రకటించారు. జిల్లాకు చెందిన నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ ఎర్రవెల్లికి ఎలా వెళ్తారని జగ్గారెడ్డి బాహాటంగా నిలదీశారు. తర్వాత రేవంత్ వ్యవహారశైలి మార్చాలని, లేకుంటే పీసీసీ చీఫ్‌నే మార్చాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోని యాకు లేఖ రాశారు. ఆ లేఖ మీడియాకు లీకవడం పార్టీలో దుమారం రేపింది. దీనిని రేవంత్ సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
క్రమశిక్షణా కమిటీ భేటీ అయి..: జగ్గారెడ్డి వ్యాఖ్యలు, లేఖ నేపథ్యం లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించింది. అనంతరం కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. విభేదాలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలని, ఇన్‌చార్జులకు లేఖలు రాయవచ్చని, కానీ బహిర్గతం చేయడం సరికాదని పేర్కొన్నారు. సోనియాకు రాసిన లేఖ లీకవడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగానే భావిస్తున్నామని, జగ్గారెడ్డిని పిలిచి వివరణ కోరుతామని చెప్పారు. ఇతర అంశాలపై జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రావుతోనూ మాట్లాడతామన్నారు. పార్టీలో కొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ప్రాంతాల్లో కమిటీ పర్యటించి సమస్యల పరిష్కరిస్తుందని వెల్లడించారు.
రేవంత్‌వి క్రమశిక్షణ కిందికి రావా?: జగ్గారెడ్డి
పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత.. జగ్గారెడ్డి మీడియాకు విడుదల చేసిన ప్రకటన మరింత కాక రేపింది. ‘‘నా గురించి చిన్నారెడ్డి మాట్లాడినందునే.. నేను కూడా మీడియాకు ప్రకటన ఇస్తున్నాను. నేను సోనియాకు రాసిన లేఖ మీడియాకు లీకైతేనే క్రమశిక్షణ ఉల్లంఘన అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో పార్టీ నియమాలను ఉల్లంఘించి మరీ పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రారా? నా సొంత ఉమ్మడి జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు చెప్పకుండా పార్టీ కార్యక్రమాన్ని ప్రకటిస్తే క్రమశిక్షణ కిందకు రాదా? వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జినైన నాకు తెలియకుండా భూపాలపల్లిలో రచ్చబండకు వెళ్తున్నట్టు ప్రకటించడం ఏమిటి? అసలు క్రమశిక్షణ పాటించని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి క్రమశిక్షణ గురించి చెప్పాలి. మొదట రేవంత్‌రెడ్డిని పిలిచి మాట్లాడాలి.’’ అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత తానూ కమిటీ ముందు హాజరవుతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment