సాక్షి, గుంటూరు: వంగావీటి మోహనరంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆనాడు ఆయనను హత్య చేసిన వారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సోమవారం గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని హాజరై రంగా చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. 'తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వంగావీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపింది. వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణం. రంగాను రాజకీయంగా ఎదుర్కొలేకే చంపేశారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితి టీడీపీది. వంగవీటి రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డుతొలగించుకున్నారు.
రంగాను పొట్టనపెట్టుకున్న పార్టీలు కూడా నేడు దిగజారి మాట్లాడుతున్నాయి. రంగా చావుకు కారణమైన వ్యక్తులు కూడా ఈ రోజు ఆయన బూట్లు నాకుతున్నారు. రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారు. ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉంది. రంగా హత్య కేసులో దేవినేని ఉమ, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలు. నేను టీడీపీలో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్ పీకాడు. ఇప్పుడు అదే టీడీపీ ఆయన కోసం పాకులాడుతోంది. వంగవీటి రంగా కుటుంబంతో నాకు అనుంబంధం ఉంది. వంగవీటి రాధా మా కుటుంబ సభ్యుడు. రాధాతో మా ప్రయాణం పార్టీలకు అతీతం. మరణించే వరకు రంగా ఆశయాలను కొనసాగిస్తాం. గుడివాడలో ఎవరు గెలవాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఇచ్చిన హామీలను అమలుచేశాం.
గుడివాడలో నన్ను ఓడించడం కష్టం. గుడివాడ ఓటర్లు నా భవిష్యత్తుని నిర్దేశిస్తారు. మాకు ఏ పార్టీతో పొత్తు అక్కర్లేదు. ఎవరి బూట్లు నాకం. దటీజ్ వైఎస్సార్సీపీ.. దటీజ్ జగన్. ఇచ్చిన హామీలను చెప్పినట్టుగా అమలు చేశాం. మీకు ఇష్టం అయితే ఓట్లేయండి.. లేకుంటే పీకి పక్కనేయండని జగన్ చెబుతున్నారు. బాధ్యతతో లేకుంటే ఓడిపోతామనే భయం నాకు, జగన్ కు ఉంది. భయం ఉంది కాబట్టే.. గెలుస్తున్నాం. భయం.. భక్తితో నా బాధ్యతని నెరవేర్చే ప్రయత్నం చేస్తాను' అని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
చదవండి: (రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ)
Comments
Please login to add a commentAdd a comment