సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం మరోమారు చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి వరకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశం కాంగ్రెస్ పార్టీలో రక్తి కట్టించగా, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఆయన అవే సమావేశాల వేదికగా సీఎల్పీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక ఎత్తయితే, కేసీఆర్‌తో కొట్లాడే వేదికనే తాను ఎంచుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలున్నారని, ఆయనపై కాంగ్రెస్ గట్టిగా బాధ్యత తీసుకుని కొట్లాడితే కాంగ్రెస్‌లోనే ఉంటానని, పార్టీ పక్షాన 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, కేడర్ ఇప్పటికీ ఉందని, కలిసికట్టుగా పని చేస్తే అధికారంలోకి వస్తామని కూడా చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన ఆయన తాను పార్టీ మారలేదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తన పదవులకు రాజీనామా చేసి వెళ్తానని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ కేసీఆర్‌పై కొట్లాడే వాళ్లతోనే తాను ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది.
సోదరుల తీరుపై చర్చ
మరోవైపు అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, అదే రోజున భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలవడంతో బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలను అధికారికంగా, అనధికారికంగా ఎక్కడా సోదరులు కానీ ఆయన అనుచరులు కానీ ఖండించడం లేదు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ విలక్షణ రాజకీయం ఎటువైపు వెళుతుంది? కాంగ్రెస్‌లోనే ఉంటారా? పార్టీని వీడతారా? లేదంటే ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ఈ వ్యవహారం టీకప్పులో తుపానులా మారుతుందా? అన్నది కాంగ్రెస్ సహా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment