
కొడవలూరు(పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా): ‘ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉన్న వలంటీర్ వ్యవస్థను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వణుకు పట్టుకుంది. అందుకే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నాడు.’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని నార్తురాజుపాళెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వలంటీర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో అర్హులకు పక్కాగా ప్రభుత్వ పథకాలందిస్తున్నట్లు చెప్పారు.
కరోనా గడ్డు కాలంలో ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో ఉండి అండగా నిలిచారన్నారు. వారి పనితీరును చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. దీంతో ఎల్లో మీడియాలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును మొత్తం వలంటీర్ వ్యవస్థకు ఆపాదించి ఇష్టం వచ్చినట్లు రాయడం సబబేనా అని ప్రశ్నించారు.
పలువురు ముఖ్యమంత్రులు ఈ వ్యవస్థ గురించి తెలుసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఎల్లో మీడియా పనికట్టుకుని వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని బాబు పగటికలలు కంటున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని బాబు గుర్తించుకోవాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, జెడ్పీటీసీ పి.సరోజనమ్మ, ఎంపీపీ జి.జ్యోతి, సర్పంచ్‌లు బి.సుప్రియ, ఎన్.కామాక్షి, ఎంపీటీసీ పి.అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment