సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే రోజా, సింగర్ ఎస్పీ శైలజ పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కుప్పం పర్యటనపై విమర్శలు చేశారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు.. కుప్పం చుట్టు గిరగిరా తిరుగుతున్నారని విమర్శించారు.
14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు.. కుప్పం ప్రజలకు కనీసం మంచి నీటి సౌకర్యం కల్పించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లుకట్టుకోవాలనే ఆలోచన వచ్చిందంటే.. ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారని అర్థం అవుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునే చంద్రబాబుకు.. కుప్పం ప్రజలు వాస్తవాలను చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు నెత్తిన ఉన్న కళ్లు నేలకి దిగాయని రోజా పేర్కొన్నారు.
ముందస్తు ఎన్నికలు అంటున్న చంద్రబాబు వాస్తవాలను గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. కావాలంటే చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు సరదాగా ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రండి.. మీ సరదా వైఎస్ జగన్ తీర్చేస్తాడని రోజా ఘాటుగా స్పందించారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్న,కరోనా,వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నప్పటికి.. ఇచ్చిన అన్ని హామీలను వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని రోజా తెలిపారు. సీఎం జగన్.. చంద్రబాబులా కుంటిసాకులు చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదని, ప్రతి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నారని రోజా అన్నారు. అందుకే ప్రజలు సీఎంగా జగన్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment