ప్రమాణం చేస్తున్న సూర్యనారాయణ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతిని రుజువు చేస్తానంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బుధవారం సత్య ప్రమాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిక్కవోలు గణపతి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు అధికారులు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఆయన భార్యతో కలిసి సత్యప్రమాణం చేశారు.
ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వినాయకుని సత్యనీతితో ప్రమాణం చేశా. రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదు. ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దేవుని దగ్గర దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోయింది. అసత్య ఆరోపణలు చేసే వారికి మీడియా టైం కేటాయించొద్దు. రాబోయే రోజుల్లో రామకృష్ణా రెడ్డి ఆరోపణలు ఇక పట్టించుకోం. ఆయనవి పిచ్చివాగుడు గానే భావిస్తాం. ఈ రోజుతో రామకృష్ణారెడ్డితో పరస్పర ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టేశా. పిచ్చి వారి వాదనల్ని ఇకపై పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు. ( కాపురంలో పొలిటికల్ చిచ్చు; స్పందించిన సుజాత)
కాగా, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ప్రమాణం చేయటానికి మొదట వెనకడుగు వేశారు. ప్రమాణం తర్వాత చేద్దాం.. చర్చించుకుందామని అన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో సత్యప్రమాణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment