
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్, చంద్రబాబులపై దాడి చేయించాల్సిన అవసరం మాకేంటి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు మాకు ఏ రకంగా పోటీనో.. ఎవరికి పోటీనో చెప్పాలన్నారు. సింపథీ కోసమే చంద్రబాబు, దత్తపుత్రుడి తాపత్రయమని మండిపడ్డారు. పవన్ లెటర్ ఇవ్వడం.. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టడం.. అసాంఘిక కార్యక్రమాలు సృష్టించడం అలవాటైపోయిందని అన్నారు.
'ప్రభుత్వం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కోసం రూ.250 కోట్ల డీల్ అవసరమా?. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ మాకు పోటీనా?. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియన పవన్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా?. చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం. వాళ్లపై వాళ్లే రాయి వేయించుకుని సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదు.
పవన్‌కు సానుభూతి రాకపోవడంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశాడు. పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటీషియన్. వారంలోరెండు రోజుల ఏపీకి కాల్షీట్లు ఇస్తాడు. ఇప్పటంపై పవన్‌కల్యాణ్‌కు నిజంగా ప్రేమ ఉందా?. ఇప్పటం గ్రామానికి ఇస్తానన్న రూ.50లక్షలు పవన్ ఎందుకివ్వలేదు?' అని మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.