
సాక్షి, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడుతుందని, మార్చి 14న పోలింగ్ జరుగు తుందని, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుందని వెల్లడించింది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడింది.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఏపీలో ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు, రామకృష్ట రిటైర్ కానున్నారు. ఇక తెలంగాణలో రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రిటైర్ కానున్నారు. దీంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి చిన్నారెడ్డిని ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment