సాక్షి, హైదరాబాద్: మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం మారుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, జీవో-3 తీసుకువచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో-3 రద్దు డిమాండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటూపోతున్నాం. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పోలీస్ శాఖలో కల్పిస్తున్నాం. ప్రతీ యూనివర్సిటీలో మహిళల సంఖ్య పెరిగింది. పోటీ పరీక్షల్లో మహిళలే టాప్ వస్తున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు కావాలనే కేసీఆర్ కోరారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
కానీ, జీవో-3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో-3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం మారుతోంది. ప్రజలను కలవడంలేదని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయనెందుకు ప్రజలకు కనపడటం లేదు. ఆయన ఢిల్లీ నేతలనే మాత్రమే కలుస్తారు. తెలంగాణ ప్రజలను రేవంత్ కలవడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment