మీ లాగా లాక్కోవటం తెలీదు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీది దుష్ప్రచారం
చుక్కల భూములకు చుక్కలు చూపించింది చంద్రబాబే
రైతుల భూములు కొల్లగొట్టి దోపిడీ చేసిందీ చంద్రబాబే
ఎమ్మెల్సీ పోతుల సునీత
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్సార్‌కు, సీఎం జగన్‌కి ప్రజలకు భూములివ్వడమే తెలుసని, చంద్రబాబులా భూములు లాక్కోవడం తెలియదని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆమె శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ అధికారంలో ఉండగా రాజంపేట – రైల్వే కోడూరు మధ్య వందలాది ఎకరాల సొంత భూమిని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి రాసిచ్చేశారని తెలిపారు.
చంద్రబాబు అమరావతి పేరుతో పేద రైతుల భూములు కొల్లగొట్టారని, గ్రాఫిక్స్ చూపించి వారిని మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు రైతుల భూములను చుక్కల భూములంటూ అన్నదాతలకు చుక్కలు చూపించారన్నారు. రైతులు అమ్ముకోకుండా యాక్ట్ తెచ్చారన్నారు. సీఎం జగన్ ఆ భూములను చుక్కల నుంచి విముక్తి కల్పించి, రైతులకు అందజేశారని తెలిపారు. 2014 –19 మధ్య రాష్ట్రవ్యాప్తంగా భూ కుంభకోణానికి పాల్పడిందీ చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. తక్కువ ధరకు భూమి తీసుకుని కోట్ల రూపాయలకు అమ్ముకొన్న ఘనుడు చంద్రబాబేనన్నారు.
విశాఖలో 100 ఎకరాల భూమి గీతంకి కట్టబెట్టిందీ బాబేనని తెలిపారు. ఇవన్నీ దాచిపెట్టి సీఎం జగన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పశువులు కూడా ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టవని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదన్నారు. అప్పుడే సీఎం జగన్ భూములు లాగేసుకొనేందుకే చట్టం తెచ్చారంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment