తన మాటల చతురతతోనే కాదు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రధాని మోదీ అందరినీ ఆకట్టుకుంటారు. ఇంతకీ ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి? ఈ ప్రశ్నకు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏమి సమాధానమిచ్చారు?
తన రాజకీయ జీవితంలో తాను 250 జతల దుస్తులు కలిగి ఉన్నానని తనపై ఒకమారు ఆరోపణ వచ్చిందని మోదీ తెలిపారు. ఈ ఆరోపణను కాంగ్రెస్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్‌సింగ్ చౌదరి చేశారని, ఓ బహిరంగ సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారని ప్రధాని మోదీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను ప్రజలతో.. ‘250 కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కావాలా? లేక 250 జతల బట్టలు ఉన్న ముఖ్యమంత్రి కావాలా?’ అని అడిగానని మోదీ గుర్తుచేసుకున్నారు. అప్పుడు గుజరాత్ ప్రజలు 250 జతల దుస్తులు కలిగిన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పారన్నారు. ప్రధాని మోదీ ఆ ఇంటర్వ్యూలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. నాడు చౌదరి ఆరోపణలను తాను అంగీకరించానని మోదీ తెలిపారు. అయితే ఆ మాజీ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ రోజు జరిగిన బహిరంగ సభలో.. ఆయన చెప్పిన సంఖ్య(250)లో సున్నా తప్పు లేదా రెండు తప్పు అని తాను చెప్పానని మోదీ అన్నారు. అయినప్పటికీ ఆ ఆరోపణను స్వీకరిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. మోదీ నెలకు రూ.1.6 లక్షల జీతం తీసుకుంటూ, అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా బ్రాండ్ మోదీ గురించి ప్రధానిని అడిగినప్పుడు, బ్రాండ్ అంటే ఏమిటో? అది ఎలా పనిచేస్తుందో తనకు తెలియదన్నారు. జనం మోదీ జీవితాన్ని, పని తీరును చూస్తున్నారన్నారు. ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.. వృద్ధురాలైన తన తల్లి చివరి రోజుల్లో ఉన్నప్పుడు తల్లితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో గడపడానికి మించిన బ్రాండ్ ఏముంటుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనిని చూసి తన జీవితం భిన్నమైనదని దేశం అర్థం చేసుకున్నదని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment