న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభిప్రాయపడ్డారు. వాటిపై పోరాడాల్సిందేనని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. అందుకే ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీల వారసులెవరికీ టికెట్లివ్వలేదని వెల్లడించారు.
‘‘అది నా వ్యక్తిగత నిర్ణయం. నా వల్లే వారి వారసులకు టికెట్లు రాలేదని ఎంపీలకు నేరుగా నేనే చెప్పాను. వారసత్వ రాజకీయాలపై పోరాడాలంటే దాన్ని ముందుగా మన పార్టీ నుంచే మొదలు పెట్టాలి. దీన్ని అర్థం చేసుకుని ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు ఎంపీలకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ చెప్పినట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చిన కనీసం 100 పోలింగ్ బూత్‌లను గుర్తించి అందుకు కారణాలు వెలికి తీయాలని ఎంపీలను ఆయన ఆదేశించినట్టు చెబుతున్నారు.
తాజా చిత్రం ద కశ్మీర్ ఫైల్స్‌ను మోదీ అభినందించారని, ఇలాంటి సినిమాలు తరచూ రావాలని సూచించారని తెలిసింది. ఎన్నికల విజయంపై మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను నేతలు ఘనంగా సన్మానించారు.
ఆపరేషన్ గంగపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment