గుజరాత్ పర్యటనలో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని. పూలదండలతో అలంకరించిన ఓపెన్ టాప్ కారులో మోదీ10 కి.మీ. ప్రయాణించారు.
తెలంగాణలో పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీకి 4 రాష్ట్రాల్లో గెలుపు కొత్త జోష్ ఇచ్చింది. ఆ ఊపుతోనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని అనుకూలంగా మల్చుకోవాలని నిర్ణయించింది. నేరుగా పార్టీ జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. పవర్ కోసం ‘పంచ సూత్రాల’ను అనుసరించాలని.. పార్టీల నుంచి చేరికలపైనా దృష్టిపెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయి నుంచి మద్దతు కూడగట్టుకోవాలని, టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేందుకూ సిద్ధంగా ఉండాలని సూచించింది.
సాక్షి, హైదరాబాద్: యూపీ వంటి కీలక రాష్ట్రాన్ని నిలబెట్టుకున్న ఊపులో తర్వాతి లక్ష్యాలపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో అధికారం సాధించేందుకు అవకాశం ఉందన్న అంచనాలతో మరింతగా ఫోకస్ చేసేందుకు సిద్ధమైంది. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ‘పంచ సూత్రాల’ను నిర్దేశించిన జాతీయ నాయకత్వం.. ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. వచ్చే నెల 14న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న రెండోదశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి అమిత్‌షా లేదా పార్టీ అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.
ఏదైనా ఒక జిల్లాలో జేపీ నడ్డా పాల్గొనే విధంగా బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఈ నెల 21–24 తేదీల మధ్య.. 8 జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, అధికార పార్టీ బలాన్ని పరిశీలించనున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ దృష్టి పెట్టారు.
ఢీ అంటే ఢీ అందాం..: ప్రజల్లో క్షేత్రస్థాయికి వెళ్లే క్రమంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమల్లో వెనకడుగుపై గట్టిగా నిలదీయాలని.. రాజీలేని పోరు సాగించాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండాలని అన్నిస్థాయిల్లో నేతలు, కార్యకర్తలను ఆదేశించింది. గత ఏడేళ్లలో, ముఖ్యంగా 2018 ఎన్నికలకు ముందిచ్చిన హామీల అమల్లో టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాన్ని గట్టిగా ఎత్తి చూపాలని సూచించింది. అయితే బీజేపీ నేతలపై కేసులు, దాడులు వంటి బెంగాల్ తరహా రాజకీయాలకు టీఆర్‌ఎస్ శ్రీకారం చుట్టిందని.. అందువల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ సూచించినట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
సానుకూలత ఓట్లుగా మారాలి: తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత రోజురోజుకు పెరుగుతోందని.. దీనిని ఓటింగ్ కింద మల్చుకునేలా అన్ని స్థాయిల్లోని పార్టీ యం త్రాంగం కృషి చేయాలని ఇప్పటికే అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 6 శాతమే ఓట్లురాగా.. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లు, నాలుగు ఎంపీ సీట్లు రావడం దీనికి స్పష్టమైన సంకేతమని గుర్తుచేస్తోంది.
చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్..: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు భారీగా చేరికలపై బీజేపీ దృష్టి పెడుతోంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇతర చిన్నపార్టీల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలను చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధానంగా టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు కాంగ్రెస్ నుంచి కూడా సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్య నేతల చేరికల పర్వం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయిలో మంతనాలు, చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి.
ఇద్దరు, ముగ్గురు నేతలతో జాబితాలు!
ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండేందుకు 110 నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో నేతల పరిస్థితి ఏమిటి, విజయావకాశాలు ఎలా ఉన్నా యన్న దానిపై క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. గెలిచే అభ్యర్థులను గుర్తించి, బరిలో నిలిపేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
ఎస్సీ, ఎస్టీ సీట్లపై ప్రత్యేక దృష్టి
‘‘రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లపై మా పార్టీ దృష్టి పెట్టింది. అక్కడ ప్రత్యేక కమిటీలు వేసి కార్యాచరణను అమలు చేస్తున్నాం. పరిస్థితులు, వివిధ పార్టీల అభ్యర్థుల బలాబలాలపై పరిశీలన పూర్తయింది. ఎస్సీ, ఎస్టీలే కాకుండా ఇతర వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి మొగ్గు ఎటుందనేది పరిశీలిస్తున్నాం.’’ అని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తెలిపారు.
పవర్‌కు ‘పంచ సూత్ర’!
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడానికి ముఖ్యంగా 5 అంశాలను పాటించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి సూచించింది. ఈ క్రమంలోనే తమపార్టీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జాతీయ నాయకత్వం సూచించిన అంశాలివీ..
►పోలింగ్ బూత్ స్థాయి నుంచీ పార్టీ బలోపేతం
►ఇతర పార్టీల నుంచి భారీగా నాయకులు, కొత్తవారి చేరికలు
►ఎలాంటి అడ్డంకులు, సవాళ్లు ఎదురైనా అధికార టీఆర్‌ఎస్‌పై మడమ తిప్పని పోరు
►పార్టీలో అన్ని స్థాయిల్లో ఐకమత్యం–అన్ని విభాగాలు, నాయకుల మధ్య పూర్తి సమన్వయం
►రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎండగట్టడం, సమస్యలపై పోరాడటం ద్వారా ప్రజల్లో పట్టుపెంచుకోవడం, ఇందుకోసం మీడియా, సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం.
ఇక తెగించి పోరాడుతాం..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. దీనికి తగ్గట్టుగా హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు అందుతోంది. టీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలు, హామీల అమల్లో నిర్లక్ష్యంపై పోరాటం చేస్తాం. తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యాం. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల వివరాలు సేకరిస్తున్నాం. అంతేకాదు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నిష్క్రియాపరత్వం, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపడతాం. అసెంబ్లీ సీట్ల వారీగా మొత్తం సమాచారం సేకరిస్తున్నాం. త్వరలో క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రారంభిస్తాం.
– బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment