సాక్షి, హైదరాబాద్: అధికారిక కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నా.. ఇది పొలిటికల్ ట్రాక్‌పైనే సాగే అవకాశం కనిపిస్తోందని, రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాన్ని చక్కబెట్టే దిశగానే మోదీ ప్రసంగం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరో నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. అధికార బీఆర్‌ఎస్, కేసీఆర్ సర్కారు విషయంలో బీజేపీ అనుసరించబోయే వైఖరిని ప్రధాని సుస్పష్టం చేస్తారని అంటున్నాయి.
కొన్నిరోజులుగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేననే ప్రచారానికి దీనితో చెక్ పడుతుందని.. రాష్ట్ర పార్టీలో తిరిగి ఉత్సాహం నెలకొంటుందని వివరిస్తున్నాయి. మోదీ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ సర్కారు, కేసీఆర్ కుటుంబ పాలన అంశాలను ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా లేవనెత్తుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అందించిన సహాయ, సహకారాలను వివరించే ప్రయత్నం చేస్తూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పేర్కొంటున్నాయి.
అవగాహన ప్రచారాన్ని ఆపేలా.. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయకారీ అవగాహన కుదిరినందునే.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ పెద్దలు విమర్శలు తగ్గించారని కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడేలా ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశం ఉందని.. కేసీఆర్ కుటుంబ పాలన, బీఆర్‌ఎస్ సర్కారు అవినీతి, అక్రమాల అంశాలను లేవనెత్తుతారని అంటున్నాయి.
ఇటీవల భోపాల్‌లో జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కుటుంబ, వారసత్వ పాలన కారణంగా అభివృద్ధి మందగించిందని.. కేవలం కుటుంబ శ్రేయస్సే ధ్యేయంగా ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మోదీ విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. కేవలం కేసీఆర్ కుమార్తె కవితకే ప్రయోజనం చేకూరుతుందని, అదే బీజేపీని గెలిపిస్తే ప్రజలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారని ప్రస్తావిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును పరోక్షంగా ప్రస్తావనకు తెచ్చి కేసీఆర్ కుటుంబాన్ని ఎండగడతారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో సరైన అభివృద్ధికావాలంటే.. బీజేపీ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని పిలుపునిస్తారని అంటున్నాయి. పార్టీ శ్రేణులను ఉత్సాహ పర్చేలా.. వరంగల్ బహిరంగ సభకు ‘విజయ సంకల్ప సభ’గా నామకరణం చేసిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేలా, నేతలు, కేడర్‌ను ఉత్సాహపర్చేలా ప్రధాని మోదీ ఉపన్యాసం ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు.
కొన్నిరోజులుగా పార్టీలో నెలకొన్న గందరగోళానికి ప్రధాని పర్యటన చెక్ పెడుతుందని, పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో తెలంగాణకు కేంద్రం అందించిన నిధులు, పథకాలు, ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రస్తావిస్తారని.. వాటి వల్ల ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను వివరిస్తారని అంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు.
కాంగ్రెస్, ఇతర విపక్షాల తీరును ఎండగట్టేలా
తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్న క్రమంలో ప్రధాని మోదీ ఈ సభా వేదికను దానికి అనుగుణంగా వినియోగించుకోనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాల వైఖరి, రాజకీయ అంశాలపైనా మోదీ తన ప్రసంగంలో ఘాటు విమర్శలు చేస్తారని అంటున్నాయి. ఈ క్రమంలో శనివారం నాటి పర్యటన, ప్రసంగం ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయవర్గాలతోపాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment