సోమవారం తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్
దళితబంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తాం. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరికీ వర్తింప చేస్తాం. తద్వారా బలమైన అంతరాలు లేని సమాజాన్ని నిర్మిస్తాం. ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం ఒక క్రీడ, టీఆర్‌ఎస్‌కు మాత్రం ఇది ఒక టాస్క్ (లక్ష్యం). ఎత్తుకుంటే ఎందాకైనా వెళ్లాలి, పట్టుబట్టి పనిచేయాలి. నాకు రాజకీయం కొత్తకాదు. కావాల్సింది రాజకీయాలు కాదు, ఫలితాలు సాధిం చడమే ముఖ్యం. పదవులు వస్తాయి పోతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నేను పదవులు చేపట్టకుండా పక్కన ఉందామనుకున్నా.
ఎవరికి అప్పజెపితే ఏమవుతుందో అని చాలామంది ఆందో ళన వ్యక్తం చేయడంతో బాధ్యత ఎత్తుకున్నా’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దళిత బంధు పథకం తమాషా కోసం చేపట్టిన పథకం కాదని, దళిత సమాజ ఉద్ధరణ కోసం చేపట్టామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు సోమవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా తరలివచ్చిన మోత్కుపల్లి అనుచరులు, పార్టీ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
దళితబంధు ఓ దిక్సూచి
‘పరిపాలన చేస్తున్న వారికి ఫలితాలు కావాలి. ప్రతీప శక్తులను ఎందుర్కొంటూ ముందుకు సాగాలి. అందరూ ఆర్థికంగా ఎదిగితేనే అది బంగారు తెలంగాణ అవుతుంది. తెలంగాణ దళిత సమాజానికి దళితబంధు పథకం ఒక దిక్సూచి. దళితబంధును విజయవంతం చేస్తే ఇతర వర్గాల అభివృద్ధికి కూడా మార్గం దొరుకుతుంది. రాష్ట్రంలో జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న దళితుల చేతుల్లో భూమి అతి తక్కువగా ఉంది. అంబేడ్కర్ చూపిన బాటలో తెలంగాణ పయనించాలి. వెనుకబాటుకు అన్యాయానికి గురైన వారిని మొత్తం తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చి బాగు చేసుకోవాలి.
విద్యుత్, వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, రైతు సంక్షేమం వంటి ఎన్నో అంశాలు క్రమంగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ‘బంగారు వాసం’ పెట్టామని చెప్పడం లేదు. కానీ చేనేత కార్మికులు, గొర్రెల కాపరులు, గీత కార్మికులు తదితర వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమేర అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సి ఉంది..’ అని కేసీఆర్ చెప్పారు.
వారికెందుకు దళితబంధు ఆలోచన రాలేదు
‘యజ్ఞంలా చేపట్టిన దళితబంధు పథకం ఆగదు, క్రమంగా గిరిజనులు, బీసీలు, ఈబీసీలకు కూడా ఈ పథకం చేరుతుంది. కరోనా మూలంగా దళితబంధు పథకం ప్రారంభం కొంత ఆలస్యమైంది. ఇంట్లో రోగం వచ్చిన వాడికి టానిక్ పోసినట్లే రాష్ట్ర ఖజానాకు వచ్చిన సంపదను ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజలకు చేరవేస్తాం. అవకాశం లేని బలహీనులు, బాధలో ఉన్న వారిని చేరుకుని, వారిని ఆర్థికంగా నిలబెడతాం.
గతంలో అధికారంలో ఉన్న వారికి దళితబంధు అమలు చేయాలనే అలోచన ఎందుకు రాలేదు. బలమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల కలిగిన నాయకుడు తెలంగాణకు అవసరం. సాధించుకున్న రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, చెడగొట్టాలన్నా మన చేతుల్లోనే ఉంది. దళితబంధు పథకానికి వెచ్చించే రూ.1.70 లక్షల కోట్లు.. రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాయి. ఈ పథకం అమలు చేసేందుకు దమ్మూ ధైర్యం కావాలి. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే అధికారం..’ అని సీఎం అన్నారు.
జరగాల్సిన కృషి ఎంతో ఉంది
‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితికి దిగజారి అనేక బాధలు పడుతూ చెదిరిపోయింది. తెలంగాణకు పెట్టుబడులు రావంటూ ఆనాటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధించాయి. తెలంగాణ ఒక ప్రయోగశాల, ప్రత్యేక రాష్ట్రం వస్తే నక్సలైట్లు ఏకే 47లు పట్టుకుని తిరుగుతారని అపోహలు చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అలాంటి సమస్యలు, భయాల నడుమ నేను ఉద్యమం ప్రారంభిస్తే.. చంపుతారంటూ అనేకమంది భయపెట్టి వెనక్కిలాగాలని చూశారు.
కానీ ప్రత్యేక రాష్ట్రం అయితేనే బాగుపడతామని, ఏనాటికైనా తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వస్తుందనే ధైర్యంతో ముందుకు సాగి జాతీయ పార్టీలను ఒప్పించి ప్రత్యేక తెలంగాణ సాధించాం. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో తాగునీరు, రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం ఇలా ఎన్నో సమస్యలు ఎదురైనా దారి వేసుకుంటూ ముందుకు సాగాం. ఇప్పుడు చెరువులు, కుంటల్లో జలకళ, పచ్చదనంతో గ్రామాలు క్రమంగా ఓ రేవుకు వస్తున్నా ఇంకా జరగాల్సిన కృషి ఎంతో ఉంది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మోత్కుపల్లి సేవలు వాడుకుంటాం
‘మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని తపించే వ్యక్తి, నాకు సన్నిహితుడు. ఆయన సేవలను కేవలం ఆలేరు, నల్లగొండ జిల్లాలకే పరిమితం చేయకుండా ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో వాడుకుంటాం. దళితబంధు పథకంపై నేను మొదటగా మాట్లాడింది మోత్కుపల్లితోనే.
ఆయన కరోనా బారిన పడినప్పుడు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించా. రాజకీయాలు వేరు, స్నేహం వేరు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment