కేశినేని చిన్ని, ఎన్నారై పెమ్మసానికి బెజవాడ, గుంటూరు స్థానాలు
పార్టీ ఫిరాయించిన లావు, వేమిరెడ్డిలకు నరసరావుపేట, నెల్లూరు
విశాఖలో జీవీఎల్‌కు బాబు ఝలక్.. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కు టికెట్
ఏలూరు ఎంపీ సీటు యనమల అల్లుడికి కేటాయింపు
ఎవరూ దొరక్క తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు
మైలవరం అసెంబ్లీ సీటు వసంతకే.. దేవినేని ఉమాకు షాక్
ఎట్టకేలకు పెనమలూరు సీటు బోడెకు ఖరారు
సర్వేపల్లి మళ్లీ సోమిరెడ్డికే
సాక్షి, అమరావతి : తెలుగుదేశంలో పార్టీలో అనుకున్నదే జరుగుతోంది. ధనస్వామ్యానికే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. డబ్బున్నవారికే సీట్లు కట్టబెడుతున్నారు. తాజాగా.. శుక్రవారం ప్రకటించిన టీడీపీ మూడో జాబితాలో ఈ విషయం తేలిపోయింది. ఉదా.. విజయవాడ, గుంటూరు స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కి ఎంపీ సీట్లు కేటాయించారు.
నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇక బీజేపీ కోరుతున్న విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ రెండవ అల్లుడు, లోకేశ్ తోడల్లుడు అయిన మోత్కుమిల్లి భరత్‌కు కట్టబెట్టారు. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు.
కడప నేతకు ఏలూరు సీటు..
ఏలూరు ఎంపీ సీటును మాత్రం అనూహ్యంగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి కేటాయించారు. కడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ కుమారుడైన మహేష్‌కి ఏలూరు సీటు కట్టబెట్టడంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆ సీటును ఆశించి అక్కడ పనిచేస్తున్న గోపాల్ యాదవ్, మాజీ ఎంపీ మాగంటి బాబులను పక్కనపెట్టి మహేష్‌కి ఇవ్వడమేమిటని అక్కడి నేతలు రగిలిపోతున్నారు.
తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు..
బాపట్ల ఎంపీ సీటును ఆశ్చర్యకరంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కి ఇవ్వడం విశేషం. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే అవాక్కయ్యాయి. ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి కావడంతోపాటు పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. అలాంటి వ్యక్తికి చంద్రబాబు ఏపీలో సీటు ఇచ్చారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్క చంద్రబాబు చాలారోజులపాటు అన్వేషణ కొనసాగించారు.
ఐఆర్‌ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూసినా ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్‌కు బాపట్ల సీటు ఇచ్చారు. నిజానికి.. వరంగల్ ఎంపీ సీటు కోసం బీజేపీ తరఫున పోటీచేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా ఏపీలో సీటు ఇవ్వడం గమనార్హం.
సోమిరెడ్డికే సర్వేపల్లి టికెట్..
అలాగే, నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో పలువురి కొత్త నేతల పేర్లు తెరపైకి తెచ్చి హడావుడి చేసినా చివరికి అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబుకే ఆ సీటు కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లిని ఎట్టకేలకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు. ఆ సీట్లో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీలో చేరిన తర్వాత సోమిరెడ్డి స్థానంలో మరొకరికి ఇచ్చేలా రాజకీయం చేశారు. ఒక దశలో సోమిరెడ్డి కాకపోతే ఆయన కుటుంబంలో ఎవరికైనా సీటు ఇవ్వాలని చూశారు. కానీ, చివరికి సోమిరెడ్డికే సీటు ఖరారుచేశారు.
ధర్మవరం, హిందూపురం.. గరం గరం..
ఇక ధర్మవరం సీటు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ఓ వైపు పరిటాల శ్రీరాం, మరోవైపు వరదాపురం సూరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో.. హిందూపురం ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంతో ధర్మవరం సీటు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథి పేరు ఖరారు చేయడంతో నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ ఆశలు ఆవిరయ్యాయి. ఎంపీ టికెట్ తనదేనని ప్రచారం చేస్తున్న బీజేపీ నేత పరిపూర్ణానందస్వామి దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అలాగే, వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డికి వాసు కారణంగానే టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకు ఎన్నికల్లో టికెట్ లేదని గతంలో నారా లోకేశ్ ప్రకటించినా నెల్లూరు జిల్లా సర్వేపల్లి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఊరించి ఉసూరుమనిపించారు.
దేవినేని ఉమాకు షాక్.. వసంతకే మైలవరం టికెట్
మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివాదంగా మారిన పెనమలూరు, మైలవరం అసెంబ్లీ సీట్లకు బోడె ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ పేర్లను ఖరారుచేశారు. మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు గట్టిగా పోటీపడ్డారు. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు దేవినేని ఉమా గట్టిగా పట్టుబట్టినా ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ ధనబలంతో దాన్ని చేజిక్కించుకున్నట్లు చెబుతున్నారు.
మైలవరం టికెట్‌ను ఫిరాయింపు నేతకు ఇస్తున్న నేపథ్యంలో పెనమలూరు సీటుకు దేవినేని ఉమా పేరును పరిగణలోకి తీసుకుని అక్కడికి పంపుతున్నట్లు హడావుడి చేశారు. అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను పక్కనపెడుతున్నట్లు హంగామా చేసినా చివరికి ఆయనకే సీటు ఇచ్చారు. దీనివెనుకా భారీగా డబ్బు దండుకునే వ్యూహం అమలైనట్లు తెలుస్తోంది.
ఆ వ్యూహంలో చిక్కుకున్న బోడె ప్రసాద్ ఎలాగోలా టీడీపీ పెద్దలను సంతృప్తిపరచడంతో ఆయనకే సీటు ఖరారుచేశారు. దీంతో.. రెండు స్థానాల్లో ఏదీ దక్కక టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఉమాను అన్ని రకాలుగా వాడుకున్న చంద్రబాబు చివరికి కరివేపాకులా పక్కన పడేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment