మీడియాతో మాట్లాడుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తా
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెల్లడి
కిర్లంపూడి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఈ నెల 14న వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ ఎంపీ పి.మిథున్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు ఇటీవల తన నివాసానికి వచ్చి పార్టీలోకి అహ్వానించారని చెప్పారు. సీఎం జగన్ పిలుపు మేరకు పార్టీలో చేరి తన మద్దతు అందించాలని నిర్ణయించానన్నారు.
తనకు కానీ, తన కుమారుడు గిరిబాబుకు కానీ ఎటువంటి పదవులూ ఆశించకుండానే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామని, పార్టీ విజయం సాధించిన తరువాత వారు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నానని ముద్రగడ చెప్పారు. ఈ నెల 14న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య కిర్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరతానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ముద్రగడ చెప్పారు. ఆయన వెంట ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment