
సాక్షి, నల్గొండ: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి సొంత మండలం చౌటుప్పల్‌లో చేదు ఫలితాలు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు సొంతూర్లోనే షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. తొలి రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థులు అనూహ్యంగా ఓట్లు సాధించడం విశేషం. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్‌లో.. చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ 104 ఓట్లు, చెప్పుల గుర్తు గాలయ్య 157 ఓట్లు, ఉంగరం గుర్తు కేఏ పాల్ 34 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు.
(చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్)
అయితే, నిముషనిముషానికి మారుతున్న ఆధిక్యం ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీకి కలవరం పుట్టిస్తుండగా.. ఇతర అభ్యర్థులు భారీగా ఓట్లకు గండిపెట్టడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ సహా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి 63351ఓట్లను లెక్కించగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 7380 ఓట్లు సాధించారు.
బీజేపీ అభ్యర్థిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి 714 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి నాలుగు రౌండ్లలో కలిపి 907 ఓట్లు ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇక మిగతా స్వతంత్రులు, నోటాకు పోలైన ఓట్లు 2892. ఈ ఓట్లు అభ్యర్థుల గెలుపోటలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపోనవసరం లేదు! ఎవరి ఓట్లు చీలిపోయి ఓటమిపాలవుతారో? ఎవరికి మేలు జరిగి విజయబావుటా ఎగరేస్తారో చూడాలి.
(చదవండి: ఓటమి తట్టుకోలేక కౌంటింగ్‌పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment