బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నేత సీఎం రమేశ్
అడ్డగోలు సంపాదనతో అనకాపల్లి ప్రజలను కొనాలనుకుంటున్నాడు
స్థానికేతరులను జిల్లా ప్రజలు అంగీకరించరు
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): బ్యాంకులను మోసగించి, సంతకాలు ఫోర్జరీ చేసి వేల కోట్లు దోచుకున్న వ్యక్తా కూటమి అనకాపల్లి అభ్యర్థి అంటూ సీఎం రమేశ్‌పై డిప్యూటీ సీఎం, అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతబయలు వద్ద అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను పదవులు కొనుక్కోలేదన్నారు. జగనన్న తనకు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచానని, మంత్రిపదవి ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారన్నారు.
ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. పెత్తందార్లకు, పేదలకు మధ్య పోటీ జరుగుతోందని, జగనన్న సైన్యంగా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దిగుమతి మోసగాళ్లకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రాంతంతో పరిచయం లేని, ముక్కుముఖం తెలియని వ్యక్తిని ఇక్కడ పోటీ చేయించి ఈ ప్రాంత సంపదను తన బినామీ ద్వారా దోచుకోడానికే చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు.
స్థానికేతరులను అనకాపల్లి ప్రజలు ఓడిస్తారని, గతంలో అల్లు అరవింద్, నూకారపు సూర్యప్రకాశరావులకు పట్టిన గతే సీఎం రమేశ్‌కూ పడుతుందన్నారు. బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడు సీఎం రమేశ్ అని ముత్యాలనాయుడు చెప్పారు. బీజేపీ అభిమానులు ఇది గమనించాలన్నారు. చీటింగ్ ఫోర్జరీ కేసులనుంచి బయటపడేందుకే సీఎం రమేశ్ బీజేపీలో చేరాడన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ పేదలకు పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధంలో బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాలవారు జగనన్నకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. జగనన్న అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా కంబాల జోగులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment