తొలి దశ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ యూపీలో (ఈ నెల 10న 58 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది)ని ముజఫర్‌నగర్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2013 అల్లర్ల తర్వాత నుంచి ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ ప్రాంతం రాజకీయ విమర్శలకు, కులాల సమీకరణకు అడ్డాగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో తమ సత్తా చాటేందుకు ఓ వైపు బీజేపీ, మరోవైపు ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి ఒకరిపై ఒకరు వేస్తున్న నిందలు, అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఇక్కడి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ముస్లింలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీలు ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని బరిలో నిలపకపోవడం, రెండు పార్టీలు జాట్‌లు, రైతులను ఆకర్షించే ప్రణాళికలతోనే ముందుకెళుతుండటంతో ఎన్నికలు మరింత రసకందాయంలో పడ్డాయి.
ఆగస్టు 17..చరిత్ర మరవని రోజు..
ఉత్తర్‌ప్రదేశ్ చరిత్రలోనే 2013 ఆగస్టు 27 అత్యంత దుర్దినంగా గుర్తిండుపోతుంది. ఆ రోజున జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగిన వేధింపుల అంశం మతపరమైన మలుపు తిరిగి అనేక ఉద్రిక్తతలకు కారణమైంది. అప్పటి అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఓ వర్గానికి చెందిన కొందరు యువకులను విడుదల చేయడంపై మరోవర్గం ఆగ్రహాల కారణంగా అల్లర్లు రేగాయి. క్రమంగా వ్యాపించిన ఈ అల్లర్ల కారణంగా 60 మందికి పైగా మరణించారని మీడియా కథనాలు చెబుతున్నాయి. చాలామంది మహిళలపై కొన్ని చోట్ల అకృత్యాలు చోటుచేసుకున్నాయి. ఈ భయానక అల్లర్లను నిలువరించేందుకు జిల్లాలో ఏకంగా సైన్యాన్నే మోహరించాల్సి వచ్చింది. అల్లర్లలో 100 మందికి పైగా అరెస్టయ్యారు. 50 వేల మందికిగాపైగా నిరాశ్రయులయ్యారు. ఇలాంటి ముజఫర్‌నగర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు ముజఫర్‌నగర్ సదర్, పుర్కాజీ, చార్తావాల్, బుధానా, ఖతౌలీ, మీరాపూర్‌లలో ఈ నెల 10న పోలింగ్ జరుగనుంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పరిగణించే ఈ జిల్లాకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ 50 ఫ్లాటూన్ల కేంద్ర బలగాలను పంపింది.
ఎస్పీ ఎర్రటోపీని హిందువుల రక్తంతో అద్దారు..
ఇక హిందూత్వ ఎజెండాతో 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనూ ప్రధానంగా ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రస్తావిస్తోంది. అఖిలేశ్ హయాంలో జరిగిన అల్లర్లనే పదేపదే గుర్తు చేస్తున్న బీజేపీ ఎస్పీ నేతలు ధరించే ‘ఎర్రటోపీ’ని టార్గెట్ చేసింది. ‘ఎస్పీ పార్టీ నేతల టోపీలు రామభక్తుల రక్తంతో అద్దబడ్డాయి. అలాంటి వారికి ఓటెయ్యాలా’ అని ఓ వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్‌లు విరుచుకుపడుతున్నారు. అల్లరిమూకల ఆటకట్టించాలంటే బీజేపీకే ఓటెయ్యాలని అర్థిస్తున్నారు. ఇక మరోపక్క గత ఎన్నికల మాదిరే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనే హిందూ అభ్యర్థులనే బరిలో దింపిన బీజేపీ, జాట్, రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. 2013 అల్లర్ల అనంతరం ముస్లిం–జాట్‌ల మధ్య సాన్నిహిత్యం పూర్తిగా దెబ్బతింది. దీన్ని ఆసరా చేసుకొనే 2014 పార్లమెంట్, 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఆర్‌ఎల్‌డీ–ఎస్పీ కూటమి నేపథ్యంలో జాట్‌లు ఎస్పీ వైపు మళ్లకుండా గత ఉదంతాలను జాట్‌లకు గుర్తుచేస్తోంది.
స్నేహబంధాన్ని పునర్నిర్మించే పనిలో ఎస్పీ
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం–జాట్‌ల మధ్య స్నేహబంధాన్ని పునర్నిర్మించే పనిలో పడింది. జన్ పరివర్తన్ ర్యాలీల ద్వారా రెండు వర్గాలను కలిపేందుకు అఖిలేశ్ చేసిన కృషి ఫలించి ఆర్‌ఎల్‌డీతో దోస్తీ కుదిరింది. ఇక జిల్లాలో 41 శాతం ముస్లింలు ఉన్నప్పటికీ హిందువుల ఓట్లు ఏకపక్షంగా బీజేపీవైపు సంఘటితంగా కాకుండా... అన్ని స్థానాల్లోనూ కూటమి తరఫున హిందూ అభ్యర్థులనే రంగంలోకి దింపింది. అయితే సీట్ల సర్దుబాటు, టికెట్ల అంశం ఎస్పీకి కొత్త తలనొప్పులు తెచ్చింది. ముజఫర్‌నగర్ సదర్, మీరాపూర్, పుర్కాజీ,ఖతౌలీ స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలనే బరిలోకి దింపింది. దీనిపై ఆర్‌ఎల్‌డీ జాట్ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.
దీనికి తోడు పార్టీలో కీలక ముస్లిం నేతలైన ఖాదీర్ రాణా, ముర్సలిన్ రాణా, లియాఖత్ అలీలకు ఎస్పీ టికెట్లు ఇవ్వలేదు. దీంతో ముస్లింలలోనూ అసంతృప్త జ్వాలలు రేగాయి. వీటిని చల్లార్చుతూనే జాట్‌ల ఓట్లలో చీలిక రాకుండా అఖిలేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి తోడు రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ సైతం ఈ జిల్లాకు చెందినవాడే. ముజఫర్‌నగర్‌లో ఆయన ఇళ్లు ఉంది. బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ఆయన తొలినుంచీ ఆర్‌ఎల్‌డీ, ఎస్పీ పోరాటాలకు మద్దతిస్తున్నారు. దివంగత ప్రధాని, కిసాన్ నేత చౌదరీ చరణ్‌సింగ్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో చెరకు రైతుల్లో ఓ వర్గం ఎస్పీ కూటమికి మద్దతుగా ఉంది. ఎస్పీ ప్రకటించిన చెరకు రైతు బకాయిలు రూ.2,500 కోట్లను ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లో చెల్లిస్తామన్న ప్రకటన బలంగా పనిచేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment