సాక్షి, నల్లగొండ: టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నియామకాలతో జిల్లా నేతల అంచనాలు తారుమారయ్యాయి. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన వారెవరికీ పదవి దక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో ఓసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి భావించారు. తద్వారా జిల్లాలో అన్ని వర్గాలను దగ్గర చేసుకోవ్చనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకాలను చూస్తే మంత్రి మాట నెగ్గినట్టు అవగతమవుతోంది.
సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పక్కన మంత్రి, ఎమ్మెల్యేలు
తనకు ఇస్తారని కిషన్‌రెడ్డి భావించినా..
నల్లగొండలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కోటాలో తనకు కచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందన్న ఆశలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి భావించారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఇస్తారని ఎదురుచూసినా దక్కలే. ఆయనతో పాటు గుత్తా జితేందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్ కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ, అనూహ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవీంద్రకుమార్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
చదవండి: అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’
సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ అంతే..
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుల నియామకాల విషయంలోనూ ఊహించని విధంగా నియామకాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా నుంచి వై.వెంకటేశ్వర్లు, ఎస్‌ఏ రజాక్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నట్లుగానే పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. చివరకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది. దీంతో అక్కడ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్‌లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బూడిద భిక్షమయ్యగౌడ్, ఆకుల ప్రభాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని తారుమారు చేస్తూ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డికి పదవిని కట్టబెట్టారు. ఒకటి ఎస్టీ, మరొకటి బీసీ, ఇంకొకటి ఓసీ సామాజికవర్గానికి కేటాయించారు.
పవర్ సెంటర్‌గా మారకూడదనే..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ నేతలను అందరిని కలుపుకుపోయే వారినే పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని పార్టీలో మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నియోజకవర్గాల్లో కీలకమైన ఎమ్మెల్యేల మాట కాదనకుండా ముందుకు వెళ్లే వారికే పార్టీ బాధ్యతల అప్పగించాలన్న ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలకే అధిష్టానం అప్పగించింది. ఇక్కడా అదే అమలు చేసింది. దేవరకొండ ఎమ్మెల్యేకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పార్టీ నేతలు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కలిసిపోయే తత్వం కావడం.. మంత్రికి అనుగుణంగానే ఉండే నాయకుడు అయినందున ఆయన్ని నియమించింది.
చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే
సూర్యాపేటలో ఎంపీ లింగయ్య యాదవ్ కూడా మంత్రి జగదీష్‌రెడ్డికి అనుకూలంగా ఉంటారు. యాదాద్రిలోనూ అంతే. కాగా, మూడు జిల్లాల్లోనూ అధ్యక్ష పదవిని ఆశించిన వారికి ఇస్తే ఎమ్మెల్యేలకు వారికి మధ్య కొంత గ్యాప్ వస్తుందనే భావన నెలకొంది. పైగా పార్టీ అధ్యక్షులు అయినందున వారు మరో పవర్ సెంటర్‌గా మారుతారనే వాదన ఉంది. అవేమీ లేకుండా మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉండేవారికి అధ్యక్ష పదవులను కట్టబెట్టినట్లు తెలిసింది.
కాంగ్రెస్‌కు దీటుగా..
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శంకర్‌నాయక్ ఉండగా, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా వెంకన్నయాదవ్ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అనిల్‌కుమార్‌రెడ్డి ఉండగా, ఈ మూడు జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ కూడా అదే సామాజిక వర్గాల వారిని అధ్యక్షులుగా నియమించింది.
విధేయత, సమన్వయమే లక్ష్యంగా..
నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ గతంలో కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల్లో తిరిగిన అనుభవంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉంటారని పార్టీ అంచనా. బడుగుల లింగయ్య యాదవ్ కూడా టీడీపీ అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పని చేశారు. రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి విధేయునిగా ఉండటంతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటారన్న అంచనాలతోనే నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి
దేవరకొండ : జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేను అయిన నాపై పూర్తి విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.
బయోడేటా
పేరు : రమావత్ రవీంద్రకుమార్
స్వస్థలం : దేవరకొండ మండలం రత్యాతండా
రాజకీయ ప్రస్థానం: రవీందక్రుమార్ డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగానే 1995లో దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. సీపీఐ మద్దతుతో ఆయన సర్పంచ్‌గా గెలుపొందారు. 2001లో రెండోసారి కూడా సర్పంచ్‌గా గెలిచారు. సర్పంచ్‌గా మూడేళ్ల మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక 2004లో సీపీఐ తరఫున దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా విజయం సాధించాక సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. 2009లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఐ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment