సినీ హీరోలు తీరు మార్చుకోవాలి | Nallapareddy prasanna kumar reddy comments on Cinema Heros and Chandrababu | Sakshi
Sakshi News home page

సినీ హీరోలు తీరు మార్చుకోవాలి

Published Tue, Jan 11 2022 5:51 AM | Last Updated on Tue, Jan 11 2022 5:51 AM

Nallapareddy prasanna kumar reddy comments on Cinema Heros and Chandrababu - Sakshi

విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): సినీ హీరోలు తీరు మార్చుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హితవు పలికారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా టికెట్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఇది పేద ప్రజలకు మంచిది.

పేద వాడికి కాసేపు వినోదాన్ని అందించేది సినిమా. అలాంటి సినిమా విషయంలో భారీగా ఉన్న టికెట్‌ ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేశాం. సినీ హీరోలు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. వారంతా చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ పేద ప్రజలకు అన్యాయం చేయడం దారుణం. సినిమా ఇండస్ట్రీలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్న దృష్ట్యా సినిమా వారికి మేలు చేసేలా, పేదలకు అన్యాయం చేసేలా చంద్రబాబు మాట్లాడటం తగదు. అసలు సినిమా హీరోలకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారన్న విషయం కూడా తెలియకుండా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు రాజీనామా చేసి ఎన్నికకు రావాలి
కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చంద్రబాబు కలలు కంటున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు అంత నమ్మకమే ఉంటే చంద్రబాబు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికకు రావాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని తానేనని, అందరి పేర్లు రాసి పెట్టుకుని అందరి కథ చెబుతానని పోలీస్‌లను కూడా హెచ్చరించడం దారుణమని పేర్కొన్నారు.

ఇటీవల కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో 70 శాతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారని, మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. ఎప్పుడో రెండున్నర సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికల కంటే ఇప్పుడు చంద్రబాబు రాజీనామా చేసి ఎన్నికకు వస్తే సత్తా చూపుతామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని, ఆయన జీవితంలో ఇక ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. పవన్‌ కల్యాణ్‌తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని, ఎందరితో పొత్తు పెట్టుకున్నా ఆయన గెలుపు అసాధ్యమని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement