‘ఎన్టీఆర్‌కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’ | Nama Nageswara Rao Khammam BRS Lok Sabha Candidate | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?

Published Mon, Mar 4 2024 4:07 PM | Last Updated on Mon, Mar 4 2024 5:44 PM

Nama Nageswara Rao Khammam BRS Lok Sabha Candidate  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికల కోసం ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఖమ్మం తరఫున నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత మరోసారి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. 

సోమవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్‌ స్వయంగా ఈ పేర్లను ప్రకటించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. ప్రభుత్వానికి ప్రతిపక్షం  రుచి చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. కేడర్ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పని చేయాలి.. 

..దళితబంధు ఎన్నికల కోసం తేలేదు. ఒక విజన్ కోసం తెచ్చాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీని వీడి వెళ్ళే నేతలతో మనకు ఏం నష్టం లేదు. ఎన్టీఆర్‌కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మనమెంత!.  ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఒడిపోయింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు వస్తాయి తట్టుకోవాలి. మనకు గ్రౌండ్ లో పరిస్థితి అనుకూలంగా ఉంది. నేతలు కలిసికట్టుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది..

.. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ప్రజలకు మన విలువ తెలుస్తుంది. రాబోయే రోజులు మనవే. ప్రభుత్వానికి పై వ్యతిరేకత అంశాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. వచ్చే రోజుల్లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. కరీంనగర్ సభ తర్వాత ఖమ్మం లో మరో బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు నియమించుకుందాం’’ అని ఆ సమీక్షలో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

ఇక.. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారాయన.

మొత్తం నాలుగుసార్లు ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన నామా.. రెండుసార్లు నెగ్గారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి మీద గెలిచారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) తరఫున పోటీ చేసిన నామా.. మళ్లీ రేణుకా చౌదరిపైనే నెగ్గడం విశేషం.

ఇదిలా ఉంటే.. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవచ్చని.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో నామా పేరును స్వయంగా కేసీఆర్‌ ప్రకటించడం గమనార్హం. అలాగే.. మహబూబాబాద్‌ నుంచి కూడా సిట్టింగ్‌ అభ్యర్థికే టికెట్‌ కేటాయించింది పార్టీ. మరోవైపు నిన్న కరీంనగర్‌, పెద్దపల్లి అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కరీంనగర్‌ నుంచి వినోద్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే.. అధికారికంగా వీళ్ల పేర్లను పార్టీ ప్రకటించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement