Khammam Parliament
-
TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. కాగా, వీహెచ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఖమ్మం తరఫున నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత మరోసారి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్ స్వయంగా ఈ పేర్లను ప్రకటించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. కేడర్ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పని చేయాలి.. ..దళితబంధు ఎన్నికల కోసం తేలేదు. ఒక విజన్ కోసం తెచ్చాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీని వీడి వెళ్ళే నేతలతో మనకు ఏం నష్టం లేదు. ఎన్టీఆర్కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మనమెంత!. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఒడిపోయింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు వస్తాయి తట్టుకోవాలి. మనకు గ్రౌండ్ లో పరిస్థితి అనుకూలంగా ఉంది. నేతలు కలిసికట్టుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది.. .. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ప్రజలకు మన విలువ తెలుస్తుంది. రాబోయే రోజులు మనవే. ప్రభుత్వానికి పై వ్యతిరేకత అంశాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. వచ్చే రోజుల్లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. కరీంనగర్ సభ తర్వాత ఖమ్మం లో మరో బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు నియమించుకుందాం’’ అని ఆ సమీక్షలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక.. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారాయన. మొత్తం నాలుగుసార్లు ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన నామా.. రెండుసార్లు నెగ్గారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మీద గెలిచారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) తరఫున పోటీ చేసిన నామా.. మళ్లీ రేణుకా చౌదరిపైనే నెగ్గడం విశేషం. ఇదిలా ఉంటే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవచ్చని.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో నామా పేరును స్వయంగా కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. అలాగే.. మహబూబాబాద్ నుంచి కూడా సిట్టింగ్ అభ్యర్థికే టికెట్ కేటాయించింది పార్టీ. మరోవైపు నిన్న కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే.. అధికారికంగా వీళ్ల పేర్లను పార్టీ ప్రకటించాల్సి ఉంటుంది. -
బాలికపై అత్యాచారయత్నం.. నిరాకరించడంతో!
సాక్షి, ఖమ్మం : జిల్లాలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఓ కీచక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ముస్తాఫా నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో 13 ఏళ్ల బాలిక పనిమనిషిగా చేరింది. అయితే యజమాని కుమారుడు...బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. చదవండి: బాలికపై అత్యాచార యత్నం: ప్రతిఘటించిన సోదరి పల్లెగూడెం గ్రామానికి చెందిన ఆ బాలిక 70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ దూరాగతానికి పాల్పడిన యజమాని కుమారుడు బాలికను తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: పెరుగుతున్న రేప్‌లు, తగ్గుతున్న శిక్షలు -
పథకాలు బాగు.. ‘కారు’ సారే కావాలి
సాక్షి, నెట్వర్క్ : ‘ప్రభుత్వ పథకాలు బాగున్నాయి.. వీటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది..’ ‘సంక్షేమ పథకాల అమలు బాగానే ఉంది.. అయితే, ఆ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఏటా నిధుల శాతం పెంచాలి. అప్పుడే లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మారతాయి..’ ‘రైతుబంధు భేష్.. రైతుబీమా ఇంకా బాగుంది. అయితే, భూమి పట్టా సమస్యలున్నాయి. వీటిని కూడా పరిష్కరిస్తేనే రైతులందరూ సంతోషంగా ఉంటారు..’ ‘నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు గణనీయమైన మార్పు తెచ్చాయి. వ్యవసాయ రంగం స్థితిగతులనే మార్చేశాయి..’ ఇవీ ‘సాక్షి’ రోడ్డు షోలో వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు... తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చిన ప్రజలు.. వాటిని నిరంతరం మెరుగుపరుస్తూ కొనసాగించాలని ఆకాంక్షించారు. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కే మద్దతునిస్తామని పలువురు ముక్తకంఠంతో చెప్పారు. అయితే, బీజేపీ పెద్దనోట్ల రద్దుతో రోడ్డున పడ్డామని పలువురు వాపోయారు. తమ డబ్బులు తాము బ్యాంకుల నుంచి తీసుకోవడానికి కూడా నానాపాట్లు పడ్డామని గుర్తు చేసుకున్నారు. రేణుకా చౌదరి (కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), వెంకట్ (సీపీఎం).. తలపడుతున్న ఖమ్మం లోక్‌సభ స్థానంలో జనం స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రాష్ట్ర సర్కారు పాలన ఎలా ఉంది? ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతునిస్తారు? కేంద్రంలో ఎవరు/ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, పుల్వామా దాడులతో సహా ఇంకా ఏయే అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు? అని ‘సాక్షి’ ప్రశ్నించగా, పలువురు భిన్నంగా స్పందించారు. అభివృద్ధికి బాటలు వేసుకుంటాం.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న రైతుబంధు, రుణమాఫీ, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు బాగున్నాయని, వీటి వల్ల వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయని పలువురు చెప్పారు. ముసలిమడుగుకు చెందిన వ్యవసాయ కూలీ సీహెచ్.సెల్వరాజ్, తల్లాడకు చెందిన దినసరి కూలీ జి. లక్ష్మణ్‌రావు, అన్నారుగూడెంకు చెందిన వ్యవసాయ కూలీ ఎస్.వెంకటేశ్వరరావు, రెడ్డిగూడెంకు చెందిన కౌలు రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘మిషన్ కాకతీయతో చెరువులు నిండాయి. దీంతో రైతులకే కాక మత్స్యకారులకూ ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన రోడ్డు షోలో ‘సాక్షి’ బృందం పలకరించిన వారిలో ఎక్కువ మంది ‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కడతామని, అభివృద్ధికి బాటలు వేసుకుంటా’మని చెప్పడం విశేషం. పెద్దనోట్ల రద్దుతో మస్తు తిప్పలాయె.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి కాముకులకే పట్టం కడతామని జనం అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, బ్యాంకు లావాదేవీల్లో నెలకొన్న సమస్యల కారణంగా బీజేపీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మోదీ హయాంలో శాంతిభద్రతల విషయంలో కొంతమేర బాగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ మాత్రం చిన్నాభిన్నమైందని, తాము తీవ్ర ఇబ్బందులపాలయ్యామని రైతులు చెప్పారు. బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ము సమయానికి చేతికందక విసిగి పోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హయాంలో పాలన ఆశించినంత బాగా జరగలేదని కొంతమంది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు మాత్రం దేశంలోఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్‌గాంధీపై నమ్మకం లేదని కొందరు చెప్పగా, ఇంకొందరు మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, ప్రభుత్వం మారితే తప్ప సామన్యుడికి మేలు జరగదని అభిప్రాయపడ్డారు. ఎండిన పత్తి.. మిర్చి ‘సాక్షి’ బృందం ప్రయాణించిన వివిధ మార్గాల్లో భిన్న దృశ్యాలు కనిపించాయి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, కొండాపురం, చింతపల్లి, తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెంలో ప్రధానంగా మిర్చి, పత్తి పొలాలు నీళ్లులేక ఎండిపోయిన దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఎక్కడ చూసినా ఎండిన చేలే కనిపించాయి. పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయామని తమను పలకరించిన రైతులు తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన సీతారామ పథకం ద్వారా సాగునీరు అందించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరారు. సాగర్ జలాల ప్రభావం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ప్రాంతం నాగార్జునసాగర్ రెండో జోన్ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం యాసంగి పంటకు సాగర్ జలాలు అందటం లేదు. దీంతో రైతులు ఒకింత అసహనంతో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక దఫా, సండ్ర వెంకటవీరయ్య మరో దఫా సాగర్ జలాలను విడుదల చేయించారు. దీంతో చివరి దశలో పంటలకు జీవం పోసినట్లయింది. ‘సాగర్ జలాల విడుదల అంశం ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుంది’ అని చెప్పాడు ఖమ్మం శివార్లలోని టేకులపల్లికి చెందిన చిలకల నారాయణ. ‘సాగర్ జలాలు అందిన కొందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అందని రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు’ అని ఆయన పరిస్థితిని వివరించారు. పాలన మస్తుంది.. కేసీఆర్ పాలనలో అధికారులు పనులు వెంటనే చేస్తున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. కేంద్రంలో మాత్రం మోదీ ప్రభుత్వమే రావాలి. – టి.మురళి, దినసరి కార్మికుడు కేంద్రంలోనూ ‘కారే’ రావాలి.. చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే మాలాంటి వాళ్లకు కేసీఆర్ ఎంతో సహాయం చేస్తున్నారు. కేంద్రంలో కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వస్తేనే బాగుంటుంది. అనుకున్న పనులను ఒత్తిడి తెచ్చి చేయించుకోవచ్చు. – షేక్ షమీన్, ఆరెంపుల ఓట్లప్పుడే వచ్చుడు.. మా గురించి ఎవరూ పట్టించుకునే వారెవరూ లేరు. ఓట్ల సమయంలోనే ఉరుక్కుంటూ మా దగ్గరికి వస్తరు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచిది. కాంగ్రెస్ వస్తే కేంద్రంలో బాగుంటది. – టి.వీరభద్రం, తిరుమలాయపాలెం కౌలు రైతులకు సాయం టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న పెట్టుబడి సహాయంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా సహాయం చేయాలి. ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కు వస్తే మంచిది. – తోట సైదులు, తిరుమలాయపాలెం ‘కారే’ రాబడతది.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ పాలనలో బ్యాంకుల ముందు బారులు తీరినం. రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి వీస్తోంది. కేసీఆరే ఎక్కువ సీట్లు రాబడుతడు. – మిడియం లక్ష్మయ్య, ఆనందపురం ఆ పార్టీకే మొగ్గు.. గతంలో ఎన్నికలప్పుడు తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇంతవరకూ పనులు చేపట్టలేదు. ఈ ప్రభావం అధికార పార్టీ మీద తప్పకుండా ఉంటుంది. ఖమ్మంలో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువ. కేంద్రంలో మాత్రం బీజేపీకే అవకాశం. – బి.రవి, వ్యాపారి. అధికారం మూడో ఫ్రంట్‌దే బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. బ్యాంక్‌లో దాచుకున్న డబ్బు సమయానికి చేతికి అందక విసిగిపోయాం. కేసీఆర్ చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్కే అవకాశం కనిపిస్తోంది. – జి.సోమేశ్వరరావు, పాల్వంచ. అందరి సంతోషం కోసం.. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలంటే... అది కాం గ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. బడుగు, బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను కాంగ్రెస్‌కే మద్దతునిస్తా. – కొరదల సరస్వతి, మహిళా రైతు, సుజాతనగర్ -
నిర్ణయం ఆమెదే..
సాక్షి, ఖమ్మం : పార్టీ ఏదైనా.. అభ్యర్థి ఎవరైనా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపును నిర్ణయించేది మహిళలే. వీరిదే కీలక పాత్ర. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లకన్నా.. మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో వీరి ఓటే కీలకంగా మారనుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఈనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలే ప్రధాన భూమిక అయ్యే అవకాశం ఉంది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో.. ఏ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిధిలో మహిళా ఓటర్లే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక వరాలు ప్రకటిస్తున్నారు. తీరొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు, ఇతర మహిళా సంఘాలకు పార్టీలపరంగా చేసిన మేలును గుర్తు చేస్తూ.. మహిళల కోసం ఆయా పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లు 10,83,175 మంది ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 5,31,515 మంది, మహిళా ఓటర్లు 5,51,584 మంది, ఇతరులు 76 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,096 మంది అధికంగా ఉన్నారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మహిళా ఓటర్లే ఎక్కవగా ఉన్నట్లు తేలింది. ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించే సమయంలో సైతం ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడంతో ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయ్యారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటర్ల వివరాలు ఇలా నియోజకవర్గం పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం ఖమ్మం 1,41,672 1,51,896 32 2,93,600 పాలేరు 1,05,736 1,10,885 01 2,16,622 మధిర 1,03,009 1,07,342 07 2,10,358 వైరా 90,281 93,001 04 1,83,286 సత్తుపల్లి 1,13,921 1,16,501 04 2,30,426 కొత్తగూడెం 1,11,440 1,17,142 15 2,28,597 అశ్వారావుపేట 73,466 76,736 03 1,50,205 -
నాల్రోజులే ఇక ప్రచారానికి..
సాక్షి, ఖమ్మం : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేస్తూనే.. అటు విద్యార్థి, ఉద్యోగ, సామాజిక సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే పోటీపడే రీతిలో ఆయా సంఘాల వారిని కలుస్తున్నాయి. ఇక ఎన్నికల్లో తమకు కలిసొచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ గురువారం జరిగిన కేసీఆర్ సభ విజయవంతం కావడంతో సానుకూల ఫలితాలను ఆశిస్తోంది. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సీఎం పిలుపునివ్వడంతో దాని ప్రభావం పార్టీ శ్రేణులపై ఉంటుందనే భావన నామా వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. నామా విజయాన్ని కోరుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గాలవారీగా ప్రచార సరళిని ఏ రోజుకారోజు అంచనా వేస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ శ్రేణులను కలుపుకుపోవడానికి, పార్టీలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడానికి తక్షణమే పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ నేతలు ఒకే వేదికపైకి వస్తున్నా.. మనసులు మాత్రం కలవని పరిస్థితి ఉందని.. దీంతో ఎదురయ్యే ఇబ్బందులను నామా విజయాన్ని కాంక్షిస్తున్న పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నామా విజయం కోసం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న సమన్వయం, పార్టీ వ్యూహాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అభ్యర్థి నామా ఎన్నికల పర్యటన కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొనేలా చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయనకు పట్టున్న సత్తుపల్లి నియోజకవర్గంలో సైతం ఎన్నికల ప్రచారానికి హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం మాజీ మంత్రి జలగంను కలిసి.. తన విజయానికి తోడ్పాటు అందించాల్సిందిగా ఇప్పటికే అభ్యర్థించారు. అయితే గురువారం ఖమ్మంలో జరిగిన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు జలగం ప్రసాదరావు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాల్లో ఎవరికి వారే తమదైన రీతిలో కారణాలను విశ్లేషించుకుంటున్నారు. వ్యతిరేకతే ఉపకరిస్తుంది.. ఇక అధికార టీఆర్ఎస్పై గల వ్యతిరేకతే తన విజయానికి ఉపకరిస్తుందని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకాచౌదరి తన ఎన్నికల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదని, పేదల బతుకుల్లో మార్పు లేదని విరుచుకుపడుతున్న ఆమె టీఆర్ఎస్లో జరిగిన అంతర్గత పరిణామాలు సైతం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న తీరును సైతం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి రేణుకాచౌదరి వర్గీయులు ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే.. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించడంతో ఆ పార్టీలో కొంత ఉత్తేజం నెలకొంది. కాంగ్రెస్‌కు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తారని, ప్రచారం ముగియడానికి ఒకటి, రెండు రోజుల ముందు ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీ లేదా ప్రియాంకగాంధీ నియోజకవర్గ పరిధిలో పర్యటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక సీపీఐ మద్దతుతో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి వెంకట్ విజయాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తమ ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరిస్తూ.. ప్రజలను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేస్తోంది. బడుగు, బలహీన వర్గాల బతుకులు మారాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి లోక్‌సభలో గళమెత్తే అవకాశం కల్పించాలని పార్టీ నేతలు బహిరంగ సభల్లో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుదేవరావు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించడం ద్వారా ఎన్నికల ప్రచారం గావిస్తున్నారు. -
టీఆర్ఎస్లో చేరిన నామా నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజీనామా చేసినఆ పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గురువారం టీఆర్ఎస్లో చేరారు. నామ నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నేతలు బేబి స్వర్ణకుమారి, అమర్నాథ్ బాబు, అట్లూరి రమాదేవి, బ్రహ్మయ్య తదితరులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. -
‘హస్త’వాసి ఎవరిదో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడం.. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో ఎటూ తేల్చడం లేదు. ఆశావహులు మాత్రం ఢిల్లీస్థాయిలో తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఢిల్లీలోనే మకాం వేసి తమకున్న పరిచయాల ద్వారా సర్వశక్తులు ఒడ్డుతుండగా.. మరికొందరు తమకున్న మార్గాల ద్వారా టికెట్ ఖరారు చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో సహా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలిచిన జిల్లాగా ఖమ్మంకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్, సుస్థిరత లభిస్తుందనే అంచనాలతో పలువురు సీనియర్లు ఈ సీటుపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకున్న సమయానికి.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న పలువురు నేతలు ఖమ్మం ఎంపీగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను అధిష్టానానికి పంపించినా.. ఎవరిని ఖరారు చేయాలనే అంశంపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో రోజుకో పేరు చేరుతుండడం విశేషం. పలువురి దరఖాస్తు.. ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా రేణుకాచౌదరి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఆ సమయంలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ తరఫున 2009లో పోటీ చేసిన సిట్టింగ్ అభ్యర్థిని తానే అయినందున మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని రేణుకాచౌదరి ఇప్పటికే పలుమార్లు కోరారు. అయితే ఆమె టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును సైతం ఎంపీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవిచంద్రకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని శనివారం పార్టీ వర్గాల్లో ప్రచారం జరగడం, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో ఏం జరుగుతోందనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగినా.. నామా ఇంతవరకు అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఈసారి ఖమ్మం టికెట్‌ను పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తనకు ప్రతి ఎన్నికల్లో అన్యాయమే జరుగుతోందని, ఈసారి నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీనియార్టీ దృష్ట్యా తనకు అవకాశం ఇవ్వాలని వీహెచ్ అధిష్టానానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆశావహులు ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల్లోనూ... ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన రాజకీయ పక్షమైన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో రోజుకో పేరు వినిపిస్తోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ లభిస్తుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లను పార్టీ పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా శనివారం అదే సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు దాదాపు కనుమరుగు కావడం.. ఆయన టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే రీతిలో బీజేపీ, వామపక్షాల నేతలు సైతం అభ్యర్థుల ఖరారులో తలమునకలైనట్లు ప్రచారం జరుగుతోంది. -
కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసేదెవరో?
రాజకీయంగా చైతన్యవంతానికి మారుపేరు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి తొలి, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ఇక్కడి ప్రజలు పోషించిన పాత్ర చాలా కీలకం. 1952లో ఖమ్మం లోక్‌సభ స్థానం ఏర్పడగా, అప్పటి నుంచి చాలా రోజుల పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యే రాజకీయ వైరం నడిచింది. తొలుత పీడీఎఫ్, ఆ తర్వాత సీపీఐ, అనంతరం సీపీఎం, సీపీఐఎంఎల్ (న్యూడెమొక్రసీ) పార్టీలు ఇక్కడి ప్రజలను వామపక్ష ఉద్యమాల వైపు నడిపించాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఖమ్మం పార్లమెంటు పరిధిలో రాజకీయం కొంత మారుతూ వచ్చింది. కొన్నాళ్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోరాటం జరగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో మాత్రమే విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బలం చేకూరింది. అయితే, లోక్‌సభ నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలంగానే ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటల కారణంగా 2018 ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలు గెలవలేకపోయింది. ఖమ్మం అసెంబ్లీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులు. కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడిపోయినప్పటికీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, టీజేఎస్ లాంటి పార్టీల బలం నామమాత్రమే. - మేకల కల్యాణ్ చక్రవర్తి కాంగ్రెస్‌కు కంచుకోట 1952లో ఖమ్మం లోక్‌సభ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. 1962 నుంచి 96 వరకు ఏకంగా 34 ఏళ్ల పాటు 8సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ నుంచి లక్ష్మీకాంతమ్మ మూడు సార్లు, జలగం కొండలరావు, వెంగళరావు, రేణుకాచౌదరి రెండుమార్లు చొప్పున గెలిచారు. పి.వి. రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు ఒక్కోసారి గెలుపొందారు. మొత్తం మీద 1952లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు, ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు... కాంగ్రెస్ ఓడిపోయింది. 2014లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం రాష్ట్రం విడిపోయాక జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు ఈ స్థానం పరిధిలోకి వచ్చే అశ్వారావుపేట, వైరా అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచింది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ఉద్దండులైన నామా నాగేశ్వరరావు, కె.నారాయణ (సీపీఐ)ను ఢీకొని విజయఢంకా మోగించారు. ఆయనతో పాటు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), బాణోతు మదన్‌లాల్ (వైరా) ఎమ్మెల్యేలుగా వైఎస్సార్ కాంగ్రె స్ గుర్తుపై గెలిచారు. ఆపై టీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎవరు..? అధికార టీఆర్ఎస్లోని అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్‌లో నెలకొన్న నైరాశ్యం, వామపక్షాల బలహీనతల నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ తరఫున ఎవరు పోటీచేస్తారనేది ఉత్కంఠను కలిగిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడంతో ఒక్క ఖమ్మం మినహా ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. వైరాలో సీపీఐ అభ్యర్థిపై కాంగ్రెస్ రెబెల్ స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. కానీ, లోక్‌సభ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనే దానిపై అన్ని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్‌టాపిక్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చని మొదట్లో ప్రచారం జరిగినా అభ్యర్థిత్వాల ఖరారు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొంత సానుకూలత కనిపిస్తోంది. ఆయనను కాదంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పోటీలో దించే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరికి తోడు జిల్లాకే చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌కు టికెట్ ఇచ్చే అంశం కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎవరయినా సీఎం కేసీఆర్ వ్యూహంపైనే ఇక్కడ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే, రాజేంద్రప్రసాద్‌కు టికెట్ ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పరిశీలిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ నుంచి కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి, గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంస్థాగత బలాన్నే నమ్ముకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. సీపీఐ, సీపీఎంలు పొత్తు పెట్టుకుని సీపీఎం ఇక్కడి నుంచి పోటీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావులో ఒకరు బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ సీపీఐ పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. ఈసారి రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉండటంతో ఫలితం సానుకూలంగా ఉంటుందనే అంచనాలో ఆయా పార్టీల నేతలున్నారు. బీజేపీ నుంచి ఎస్. ఉదయప్రతాప్, కె.రవీందర్, జి.విద్యాసాగర్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో అభ్యర్థి ఎవరయినా కమలనాథులు గెలుపును మాత్రం అందుకోలేరు. వైవిధ్యభరితం.. భౌగోళిక స్వరూపం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ స్వరూపం అటు భౌగోళికంగానూ, ఇటు రాజకీయంగానూ వైవిధ్యభరితం.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు నెలవైన ఖమ్మం మెట్టు మొదలు, అందమైన అటవీ ప్రాం తాలతో కూడిన అశ్వారావుపేట, సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం నియోజకవర్గాలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతం గ్రానైట్ పరిశ్రమకు పుట్టినిల్లు. ఇక్కడ∙తయారయ్యే టైల్స్, శ్లాబ్స్, స్టోన్లను జపాన్, అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు. సింగరేణి కాలరీస్, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్), ఐటీసీ పేపర్ లిమిటెడ్ లాంటి పరిశ్రమలకు కూడా ఈ నియోజకవర్గం నెలవు. మామిడి, జీడి, కొబ్బరి, నిమ్మ, అరటి, జామ, ఆయిల్‌పామ్ తోటలకు ప్రసిద్ధి. వరి, మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు, చెరకు పంటలను పండిస్తారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, కిన్నెరసాని, మున్నేరు, ఆకేరు, వైరా నదులు ప్రధాన నీటి వనరులు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఖమ్మం లోక్‌సభ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కేంద్ర కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. 1991–96 మధ్య కాలంలో ఎంపీగా ఉన్న పి.వి.రంగయ్యనాయుడు పి.వి.నరసింహారావు కేబినెట్లో టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి వనరుల మంత్రి. ఆయన తర్వాత 2004–09 మధ్య కాలంలో రేణుకాచౌదరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈమె యూపీఏ–1 హయాంలోని మన్మోహన్ సింగ్ కేబినెట్లో మహిళా, శిశు సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కూడా ఖమ్మం లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపొందారు. -
విశిష్టతల సమ్మేళనం.. ‘ఖమ్మం’
ఎంతో ఘన చరిత కలిగినదిగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పేరొందింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ స్థానం నుంచి హేమాహేమీలు పోటీ చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రులనే ఎగువ సభకు పంపినవారిగా, వరుసగా పలువురిని గెలిపించిన వారిగా..కేంద్ర మంత్రులుగా చక్రం తిప్పేలా పట్టం కట్టిన వారిగా జిల్లా ప్రజలు చైతన్యవంతులనే గుర్తింపునొందారు. వివిధ పార్టీల వారిని గెలిపిస్తూ..విభిన్న తీర్పుతో సరికొత్త మార్పులకు మన జనం జై కొట్టారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ దురంధరులు అనేకమంది వివిధ పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వీరిలో ముగ్గురికి కేంద్రంలో మంత్రి పదవులు వరించగా, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఖమ్మం ఎంపీలుగా ఎన్నుకున్న ఘనత ఈ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రజా సమస్యలపై తమదైన వాణిని వినిపించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములైన ఘనత ఈ ప్రాంత ఎంపీలకే దక్కింది. 1957లో ఆవిర్భవించిన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ప్రతి ఎన్నికకు ఒక విశిష్టత, విశేషం కనిపిస్తుంది. ఒకే పార్టీ నుంచి.. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ సొంతం చేసుకోగా..వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జలగం కొండలరావులు దక్కించుకున్నారు. అలాగే కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి సైతం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్‌రావులు సుదీర్ఘ కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచే ఆయా సందర్భాల్లో పోటీచేయడం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రులుగా నిలిచిపోయారు. - జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనకంటూ ప్రత్యేక ఒరవడి, రాజకీయ శైలి ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి..ఆయా ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఖమ్మం లోక్‌సభ నుంచి 1984లో ఎంపీగా ఎన్నికై అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రాజకీయ చక్రం తిప్పారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన 27 సంవత్సరాల తర్వాత జిల్లాకు కేంద్ర మంత్రి పదవి జలగం వెంగళరావు రూపంలో దక్కింది. జలగం వెంగళరావు 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత 1984 వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1984లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మరణించడం, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జలగం వెంగళరావు ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో ఏర్పడిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో సైతం జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఎంపీగానే కొనసాగారు. కేంద్ర పరిశ్రమల మంత్రిగా కొనసాగుతూనే ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. - నాదెండ్ల భాస్కరరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్‌రావు 1998లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కేవలం సంవత్సర కాలం మాత్రమే ఎంపీగా కొనసాగారు. - పీవీ.రంగయ్య నాయుడు 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటి ఐపీఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న పీవీ.రంగయ్యనాయుడును ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఆయన గెలిచి ప్రధానమంత్రి పీవీ.నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర టెలికమ్యూనికేషన్లు, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో ఆయన రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రంగయ్యనాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజయం సాధించారు. - గారపాటి రేణుకాచౌదరి 1999, 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి రేణుకా చౌదరి విజయం సాధించారు. కేంద్రంలో ఏర్పడిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె రెండు పర్యాయాలు స్త్రీ, శిశు సంక్షేమ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. తీరొక్క పార్టీల నుంచి.. ఖమ్మం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీతో సహా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నేతలు పోటీ చేసి ఆయా సందర్భాల్లో ఎంపీలుగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. అత్యధిక సార్లు ఎంపీలుగా విజయం సాధించిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఖమ్మం లోక్‌సభ ఏర్పడిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత, పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన విఠల్‌రావు విజయం సాధించగా, దాదాపు 39 సంవత్సరాల అనంతరం మళ్లీ ఖమ్మం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసిన తమ్మినేని వీరభద్రం గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రమంతటా తెలంగాణ ప్రభంజనం కొనసాగుతున్నా..ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు పర్యాయాలు 1962 నుంచి 1976 వరకు ఎంపీగా కొనసాగిన ఘనత లక్ష్మీకాంతమ్మకే దక్కింది. అలాగే ఖమ్మం శాసనసభ్యురాలిగా సైతం ఒక పర్యాయం పనిచేసి జిల్లాలో సుదీర్ఘకాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. -
నేడు జిల్లాకు కేసీఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు విడతలుగా పర్యటిం చి పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలను పూర్తిచేసిన కేసీఆర్ మూడో విడతగా జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలకు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల కు సత్తుపల్లిలో, ఒంటిగంటకు మధిరలో జరి గే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ ఆదినుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ పతాకాన్ని ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు చెమటోడుస్తున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లింగాల కమల్‌రాజు గెలుపుకోసం ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత రెండు నెలలుగా శ్రమిస్తున్నారు. తానే పార్టీ అభ్యర్థి అన్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ పూర్తిగా మధిర నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పోటీ చేస్తుండటంతో ఈ స్థానాన్ని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించి విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మధిర అభ్యర్థి విజయం కోసం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో పల్లెనిద్రలు సైతం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ టీఆర్ఎస్ పార్టీకి మరింత లాభిస్తుందన్న అంచనాలతో పార్టీ శ్రేణులు సభ విజయవంతానికి దృష్టి సారించాయి. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష సైతం మధిర పట్టణంలో ఇంటింటికీ వెళ్లి లింగాల కమల్‌రాజ్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మధిర నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత కొండబాల కోటేశ్వరరావు గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేయడంతో పలు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పిడమర్తి రవి పోటీ చేస్తుండటంతో..ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో గెలుపు కోసం పార్టీ శ్రేణులు శ్రమించాలని స్వయంగా కేసీఆర్ గతంలో పార్టీ నేతల సమావేశాన్ని నిర్వహించి మరీ చెప్పారు. దీంతో కేసీఆర్ సభను విజయవంతం చేసే బాధ్యతను పార్టీ నేతలు భుజానికెత్తుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు..పిడమర్తి రవి విజయం కోసం పూర్తిగా సత్తుపల్లిలోనే మకాం వేసి శ్రేణులను సమన్వయ పరుస్తున్నారు. గతంలో సత్తుపల్లి శాసనసభ్యుడిగా అనేక పర్యాయాలు పనిచేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి సైతం పిడమర్తి విజయం కోసం సత్తుపల్లిలో మకాం వేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రజాకూటమి తరఫున సండ్ర వెంకటవీరయ్య పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌తో పాటు సత్తుపల్లి, మధిర సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు పాల్గొననున్నారు. సత్తుపల్లిలో సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవరా>్గలు కలిపి సభను నిర్వహిస్తుండగా, మధిరలో వైరా, మధిర నియోజకవర్గాలను కలిపి ఈ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. -
ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి
కోట్లాది తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ కొలువు {పజలు కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం ఆదుకుంది ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండడం కనీస బాధ్యత ఖమ్మం జిల్లా దశ, దిశను మార్చేందుకు ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు రికార్డులు తిరగరాసే రోజు త్వరలోనే ఉంది సీపీఎంతో ఎన్నికల అవగాహనతో వెళుతున్నాం నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైఎస్సార్ సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘సంక్షేమ పథకాలే ఆలంబనగా, పేదవారికి సేవే పరమావధిగా, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాలనకొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. వైఎస్ మరణంతో వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ వైఎస్సార్ పాలన లాంటి సువర్ణయుగం రావాలంటే అది ఆయన తనయుడు, పేద ప్రజల మనసెరిగిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే సాధ్యం. అందుకే ఆయన నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్ ఆలోచనలు, ఆయన ఆశయాలు మేలు చేస్తాయి. పేదలకు పట్టం కడతాయి.’ అని అంటున్నారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పొంగులేటి గత రెండురోజులుగా జగన్ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ విశేషాలివి.... కూడు, గూడు, గుడ్డ కోసం పేదలు ఎంతగానో శ్రమిస్తారు. కుటుంబ పోషణకు కష్టపడతారు. అయితే, ఆ పేదవ్యక్తికి ఏదైనా అనుకోని ఆపద వస్తే పరిస్థితేంటి.. అనుకోకుండా ఏదైనా జబ్బు చేస్తోనో.. వేలు, లక్షల రూపాయులు చెల్లించి పిల్లలను చదివించాలంటే.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట విపత్తులతో కళ్లముందే పాడైపోతే.. ఇలా అన్ని విషయాలపై ఆలోచన చేసిన ఏకైక మఖ్యమంత్రి వైఎస్సార్. ఎంతోవుంది సీఎంలు అయ్యూ రు. కానీ జనం గురించి ఇంతగా ఆలోచించిన నాయకుడే లేరు. ప్రజాప్రస్థానం పాదయాత్రతో వైఎస్ పేదల కష్టాలు తెలుసుకోగలిగారు. అధికారంలోకి రాగా నే రైతు రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ అవులు చేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు భరోసా ఇచ్చారు. ఆయన పాలన లో పేదలు గుండెపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీకార్డు ఉందిలే... పిల్లల చదువులకు ఫీజు ఆ ముఖ్యమంత్రే కడతాడులే... రైతన్నను కూడా ఆదుకుంటాడులే అనే నమ్మకం ప్రజలందరిలోనూ ఉండేది. వైఎస్ కూడా ఇచ్చిన వూటకు కట్టుబడేవాడు. మడమ తిప్పేవాడు కాదు. అందుకే ప్రజలకు ఆయనపై విశ్వాసం, ప్రేమ. అప్పుడు పేదలను ఆదుకున్నందుకు.... చంద్రబాబు పాలనలో వరుస కరువు, కాటకాలు, హైటెక్ పాలనతో జనం అల్లాడారు. వైఎస్ వచ్చాక ప్రజలను సురక్షిత తీరాలకు చేర్చేందుకు చాలా కష్టపడ్డారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ తేడా లేకుండా కష్టంలో ఉన్న వారికి సేవ చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉంది. ఈ తరుణంలో పేదలంతా ఆ కుటుంబానికి అండ గా నిలవడం కనీస బాధ్యత. కచ్చితంగా వైఎస్‌కు నిజమైన వారసుడు జగనేనని ప్రజలు ఓట్లు ద్వారా నిరూపించబోతున్నారు. ఆ నమ్మకం మాకుంది. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన వారున్నారు. వారి ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాం. జన తెలంగాణ కావాలి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరుదశాబ్దాలుగా తెలంగాణ బిడ్డలు సాగించిన పోరాటం అద్వితీయమైనది. ఈ క్రమంలో సిద్ధించిన నూతన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలన్నదే వైఎస్సార్సీపీ ఆకాంక్ష. దీనికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తన పాలన సాగుతుందని జగన్ చెపుతున్నారు. సీమాంధ్రలో గెలిచి ముఖ్యమంత్రి అయినా తాను తెలంగాణ విడిచిపెట్టబోనని హామీ ఇస్తున్నారు. తన తండ్రి ఇచ్చి వెళ్లిన కుటుంబాన్ని వదులుకోబోనని ఆత్మీయత చూపెడుతున్నారు. అయితే దొరలు, విదేశీయుల పాలన కన్నా ప్రజలు ..తమను తాము పాలించుకునే తెలంగాణను చూడాలన్నది నా ఆరాటం. జన తెలంగాణ స్థాపన జరిగినపుడే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సార్థకత చేకూరినట్టు. అమరవీరుల స్వప్నం నెరవేరినట్టు. వైఎస్సార్సీపీ తెలంగాణలో క్రియాశీలకంగా పనిచేస్తుంద ని, కీలకపాత్ర పోషిస్తుందని గట్టిగా చెప్పగలుగుతున్నాం. మాది విభిన్న రాజకీయ పరిస్థితి ఖమ్మం జిల్లాలో రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది. రాజకీయంగా చైతన్యవంతులయిన ఈ జిల్లా ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అనేక ప్రజాస్వామిక పోరాటాల్లో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఈ జిల్లాలో రాజకీయంగా ఎదగడం కత్తిమీద సాము లాంటిదే. వైఎస్‌పై ఉన్న అభిమానం, అనురాగంతో పాటు రైతులపై ఉన్న వాత్సల్యం నన్ను రాజకీయాల వైపునకు మళ్లించింది. రైతులకు, పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఓ వైపు పార్టీని నడిపిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై పోరాడాను. జిల్లాలో విస్తృతంగా పర్యటించాను. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నా. వారిలో ఒకడిగా ఇమిడిపోయా. ఇప్పుడు అందరూ ఆప్యాయంగా నన్ను శీనన్న అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటోంది. ఎంత కష్టపడ్డా శ్రమ అనిపించడం లేదు. వీరందరికీ సేవ చేసే భాగ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా. ప్రజలు కూడా నన్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారు. స్థానికేతరులను గెలిపించిన దాని కన్నా జిల్లా కు చెందిన నేను గెలిస్తే జిల్లా దశ, దిశ మారిపోతాయని వారు భావిస్తున్నారు. ఖమ్మంలో రికార్డులు తిరగరాసే రోజు త్వరలోనే ఉంది. మార్క్సిస్టులతో కలిసే ప్రయాణం ఈ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో సీపీఎంతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని ముందుకెళుతున్నాం. జిల్లాలో పట్టున్న సీపీఎంతో కలిసి మా కేడర్ అవగాహనతో ముందుకెళుతోంది. ఇరుపార్టీలు ఇరు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మా రెండు పార్టీల మధ్య కొంత అంతరాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కానీ మేం మాత్రం మానసికం గా ఎన్నికల అవగాహనకే సిద్ధమై ఉన్నాం. వైఎస్సార్ సీపీ లేని చోట్ల సీపీఎం అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. సీపీఎం శ్రేణులు కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి. జిల్లాలో మేం క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాబును నమ్మరు.. కేసీఆర్, కాంగ్రెస్‌లకు ఓట్లేయరు తొమ్మిదేళ్ల పాలనలో పేదల ఉసురు పోసుకున్న చంద్రబాబుని నమ్మి ప్రజలు ఓటేస్తారని అనుకోవడంలేదు. బాబు పాలన కోరుకోవడమంటే మళ్లీ ప్రజలు కష్టాలు కొనితెచ్చుకోవడమే. ఇక తెలంగాణ సాధన క్రమంలో దోబూచులాడిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను కూడా ప్రజలు ఆదరించరు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కలిపేస్తానని ఒకసారి, నేనెందుకు కలపాలని మరోసారి కేసీఆర్ చెప్పడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు రాష్ట్రాలు ఏర్పాటు చేసేది పార్టీలను కలుపుకోవడం కోసమా అనిపిస్తుంది. ఇక, 2011, డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి, వెంటనే తోకముడిచేయుడం వల్లే తెలంగాణ విద్యార్థులు, యువకుల వుృతికి కారణవుయ్యూరు, ప్రాణా ల్ని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేయాలనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఆ పార్టీకి ప్రచారం చేసే వారే కరువయ్యారు. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్సీపీ పక్షాన కీలక పాత్ర పోషించబోతున్నాం. నవతెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నాం. నాకో వ్యూ ఉంది ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన తర్వాత ప్రజలకు ఎలా సేవ చేయాలన్న దానిపై నాకిప్పటికే ఓ అవగాహన ఉంది. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా నివసించే జిల్లాలో వారి సంక్షేమమే ప్రధానం. అందుకే వారి అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించుకున్నాం. సంక్షోభంలో ఉన్న జిల్లా గ్రానైట్ పరిశ్రమను గట్టెక్కించేందుకు, విద్యుత్‌కోతలు, పన్ను మోతలు లేకుండా చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించా. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, జిల్లాలోని టెయిలెండ్ భూములకు సాగునీరు, అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో తాగునీటి సమస్య లేకుండా చేయడం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా పోరాటం... ఇలా చాలా చేయాలని ఉంది. ప్రజలు నాకు అవకాశమిస్తే నేనేంటో రుజువు చేసుకుంటా... ప్రజలకు భరోసాగా ఉంటా -
రాజన్న ఆశయ సాధనే ధ్యేయం
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా జిల్లా ప్రజలందరి అండదండలతో ముందుకెళ్తానని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ఆయన అన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న బాటలో నడుస్తున్న తనను జిల్లా ప్రజలు మరింతగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తుండడం సంతోషకరమన్నారు. వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ నుంచే ప్రారంభించేవారన్నారు. జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ తరఫున మొదటి అభ్యర్థిగా ఇదే మైదానం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ప్రకటించడం తెలంగాణ అభివృద్ధి పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్న శ్రద్ధ ఏమిటో తెలియచేస్తోందన్నారు. అచంచల మనస్తత్వం ఉన్న వైఎస్.. జలయజ్ఞంతో పాటు ఇతర అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గిరిజన ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో అనేక మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. పావలా వడ్డీ, పింఛన్లు ఇతర అనేక పథకాలు ప్రజలకు పక్కాగా అందేలా వైఎస్ కృషి చేశారన్నారు. రాజన్న స్ఫూర్తితో ఖమ్మం జిల్లా నుంచి లోక్‌సభ, 10శాసనసభ స్థానాలను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ గురించి ఛలోక్తులు విసిరే పార్టీలు తమ అభ్యర్థులెవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండడాన్ని గమనించాలన్నారు. వైఎస్సార్సీపీ మాత్రం ఆరు నెలల కిందే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్న వైఎస్సార్సీపీతో నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగించిన రాజన్న పథకాలను వైఎస్సార్సీపీ మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందన్నారు. నవ తెలంగాణలో ఇవి అత్యంత కీలకమని పొంగులేటి అన్నారు. శీనన్నను గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారు: పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి శీనన్నను గెలిపిస్తే తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్సీపీ కీలక ప్రాత్ర పోషిస్తుందన్నారు. గత నెల 5వ తేదీన ఖమ్మంలో జగన్ ప్రకటించినట్లు శీనన్న తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలన్నారు. పొంగులేటి గెలుపుతోనే జిల్లా అభివృద్ధి: కూరాకుల నాగభూషణం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు పడతాయని వైఎస్ఆర్సీపీ ఖమ్మం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగ భూషణం అన్నారు. జిల్లాకు చెందిన పొంగులేటిని గెలిపించేందుకు అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ: ఎడవల్లి కృష్ణ రాజన్న ఆశయ సాధన కోసం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని వైఎస్ఆర్సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ అన్నారు. శీనన్న గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా కృషిచేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేస్తానన్నారు. రైతుబిడ్డ శీనన్నను ఆదరించాలి: తాటి వెంకటేశ్వర్లు రైతుబిడ్డగా జన్మించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శీనన్న ఖమ్మం ప్రతినిధిగా పార్లమెంటుకు వెళితే జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. జగనన్న ఆశయ సాధన కోసం శీనన్నను గెలిపించాలన్నారు. తెలంగాణ ఎంపీల్లో పొంగులేటికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఖమ్మం జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా నిలబెట్టాలన్నారు. జగనన్నకు కానుకగా ఇవ్వాలి: మదన్‌లాల్ పొంగులేటి శీనన్నను ఖమ్మం ఎంపీగా గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త మదన్‌లాల్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు వైరా నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. శీనన్న వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు: గుగులోత్ రవిబాబు నాయక్ సాధారణ గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శీనన్న వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి శక్తిగా మారారని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ గుగులోత్ రవిబాబు నాయక్ అన్నారు. శీనన్న గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. అన్ని వర్గాలు శీనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి: సాధు రమేష్‌రెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ మూడు జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త సాధురమేష్‌రెడ్డి అన్నారు. శీనన్నను గెలిపిస్తే ఎట్టిపరిస్థితుల్లో కేంద్రమంత్రి అవుతారన్నారు. వైఎస్ ఆశయాలు, పథకాలు కొనసాగించాలంటే యువనాయకులు జగనన్న, శీనన్నలతోనే సాధ్యమన్నారు. ఖమ్మం జిల్లా జగన్ శీనన్న: మెండెం జయరాజ్ ఏ పదవి లేకున్నప్పటికీ జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పెద్దమనసుతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న శీనన్న మనసున్న మారాజని, ఖమ్మం జిల్లా జగన్ శీనన్న అని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజ్ అన్నారు. శీనన్న రాజకీయాల్లోకి రావడం జిల్లా అదృష్టమన్నారు. అందరి పట్ల ఆప్యాయంగా ఉండే శీనన్న గెలుపు జిల్లాకు అత్యవసరమన్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శీనన్న: సయ్యద్ అక్రం అలీ నిరాండబరుడు, నిగర్వి అయిన శీనన్న ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రం అలీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న పొంగులేటి శీనన్న గెలుపు జిల్లాకు, అన్ని వర్గాల ప్రజలకు అవసరమన్నారు. పొంగులేటి గెలిస్తే ఖమ్మం జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడం తథ్యం అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటి: కీసర పద్మజారెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన రాజన్న కుటుంబానికి అండగా నిలిచిన శీనన్నను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అఖండ మెజారిటీతో గెలిపించాలి: కొత్తగుండ్ల శ్రీలక్ష్మి జిల్లా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పొంగులేటి శీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శీనన్న కోసం వంద చొప్పున ఓట్లు వేయించాలన్నారు. సర్వమత ప్రార్థనలు.. సభ అనంతరం ప్రదర్శనకు ముందుగా పొంగులేటిని మైదానంలో బ్రాహ్మణులు, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు ఆశీర్వదించారు. శీనన్న సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మండుటెండలోనూ మైదానానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, వట్టికొండ జగన్మోహన్రావు, సంపెట వెంకటేశ్వర్లు, కొంపల్లి బాలకృష్ణ, కొండలరావు, మార్కం లింగయ్య, ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, ఆరెంపుల వీరభద్రం, వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కందిమళ్ల బుడ్డయ్య, జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.