‘హస్త’వాసి ఎవరిదో..? | Khammam MP Seat In Congress Party | Sakshi
Sakshi News home page

‘హస్త’వాసి ఎవరిదో..?

Published Sun, Mar 17 2019 1:17 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

Khammam MP Seat In Congress Party - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదల కావడం.. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం టికెట్‌ విషయంలో ఎటూ తేల్చడం లేదు. ఆశావహులు మాత్రం ఢిల్లీస్థాయిలో తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఢిల్లీలోనే మకాం వేసి తమకున్న పరిచయాల ద్వారా సర్వశక్తులు ఒడ్డుతుండగా.. మరికొందరు తమకున్న మార్గాల ద్వారా టికెట్‌ ఖరారు చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు సీనియర్‌ నేతలతో సహా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలిచిన జిల్లాగా ఖమ్మంకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్, సుస్థిరత లభిస్తుందనే అంచనాలతో పలువురు సీనియర్లు ఈ సీటుపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్‌ నేతలు దరఖాస్తు చేసుకున్న సమయానికి.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నాటికి జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించి పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. అయితే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి సుస్థిర ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న పలువురు నేతలు ఖమ్మం ఎంపీగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను అధిష్టానానికి పంపించినా.. ఎవరిని ఖరారు చేయాలనే అంశంపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్‌ ఆశావహుల జాబితాలో రోజుకో పేరు చేరుతుండడం విశేషం.  


పలువురి దరఖాస్తు.. 
ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకుడు రాయల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా రేణుకాచౌదరి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఆ సమయంలో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ తరఫున 2009లో పోటీ చేసిన సిట్టింగ్‌ అభ్యర్థిని తానే అయినందున మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని రేణుకాచౌదరి ఇప్పటికే పలుమార్లు కోరారు. అయితే ఆమె టికెట్‌ కోసం దరఖాస్తు చేయలేదు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును సైతం ఎంపీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్‌ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవిచంద్రకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని శనివారం పార్టీ వర్గాల్లో ప్రచారం జరగడం, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో ఏం జరుగుతోందనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగినా.. నామా ఇంతవరకు అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తమ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఈసారి ఖమ్మం టికెట్‌ను పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తనకు ప్రతి ఎన్నికల్లో అన్యాయమే జరుగుతోందని, ఈసారి నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖమ్మం టికెట్‌ తనకే ఇవ్వాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీనియార్టీ దృష్ట్యా తనకు అవకాశం ఇవ్వాలని వీహెచ్‌ అధిష్టానానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆశావహులు ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

 
ప్రధాన పార్టీల్లోనూ... 
ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన రాజకీయ పక్షమైన టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో రోజుకో పేరు వినిపిస్తోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్‌ లభిస్తుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. ఆ పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లను పార్టీ పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా శనివారం అదే సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్‌ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది.

ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు దాదాపు కనుమరుగు కావడం.. ఆయన టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే రీతిలో బీజేపీ, వామపక్షాల నేతలు సైతం అభ్యర్థుల ఖరారులో తలమునకలైనట్లు ప్రచారం జరుగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement