సాక్షి, ఖమ్మం : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేస్తూనే.. అటు విద్యార్థి, ఉద్యోగ, సామాజిక సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే పోటీపడే రీతిలో ఆయా సంఘాల వారిని కలుస్తున్నాయి. ఇక ఎన్నికల్లో తమకు కలిసొచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్ గురువారం జరిగిన కేసీఆర్ సభ విజయవంతం కావడంతో సానుకూల ఫలితాలను ఆశిస్తోంది.
పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సీఎం పిలుపునివ్వడంతో దాని ప్రభావం పార్టీ శ్రేణులపై ఉంటుందనే భావన నామా వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. నామా విజయాన్ని కోరుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు.
నియోజకవర్గాలవారీగా ప్రచార సరళిని ఏ రోజుకారోజు అంచనా వేస్తున్న టీఆర్‌ఎస్ అధిష్టానం పార్టీ శ్రేణులను కలుపుకుపోవడానికి, పార్టీలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడానికి తక్షణమే పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ నేతలు ఒకే వేదికపైకి వస్తున్నా.. మనసులు మాత్రం కలవని పరిస్థితి ఉందని.. దీంతో ఎదురయ్యే ఇబ్బందులను నామా విజయాన్ని కాంక్షిస్తున్న పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
నామా విజయం కోసం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న సమన్వయం, పార్టీ వ్యూహాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అభ్యర్థి నామా ఎన్నికల పర్యటన కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొనేలా చూస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయనకు పట్టున్న సత్తుపల్లి నియోజకవర్గంలో సైతం ఎన్నికల ప్రచారానికి హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం మాజీ మంత్రి జలగంను కలిసి.. తన విజయానికి తోడ్పాటు అందించాల్సిందిగా ఇప్పటికే అభ్యర్థించారు. అయితే గురువారం ఖమ్మంలో జరిగిన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు జలగం ప్రసాదరావు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాల్లో ఎవరికి వారే తమదైన రీతిలో కారణాలను విశ్లేషించుకుంటున్నారు.
వ్యతిరేకతే ఉపకరిస్తుంది..
ఇక అధికార టీఆర్‌ఎస్‌పై గల వ్యతిరేకతే తన విజయానికి ఉపకరిస్తుందని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకాచౌదరి తన ఎన్నికల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదని, పేదల బతుకుల్లో మార్పు లేదని విరుచుకుపడుతున్న ఆమె టీఆర్‌ఎస్‌లో జరిగిన అంతర్గత పరిణామాలు సైతం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అలాగే కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న తీరును సైతం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి రేణుకాచౌదరి వర్గీయులు ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే.. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించడంతో ఆ పార్టీలో కొంత ఉత్తేజం నెలకొంది. కాంగ్రెస్‌కు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తారని, ప్రచారం ముగియడానికి ఒకటి, రెండు రోజుల ముందు ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీ లేదా ప్రియాంకగాంధీ నియోజకవర్గ పరిధిలో పర్యటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
ఇక సీపీఐ మద్దతుతో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి వెంకట్ విజయాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తమ ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరిస్తూ.. ప్రజలను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేస్తోంది. బడుగు, బలహీన వర్గాల బతుకులు మారాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి లోక్‌సభలో గళమెత్తే అవకాశం కల్పించాలని పార్టీ నేతలు బహిరంగ సభల్లో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుదేవరావు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించడం ద్వారా ఎన్నికల ప్రచారం గావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment