సాక్షి, ఖమ్మం : పార్టీ ఏదైనా.. అభ్యర్థి ఎవరైనా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపును నిర్ణయించేది మహిళలే. వీరిదే కీలక పాత్ర. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లకన్నా.. మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో వీరి ఓటే కీలకంగా మారనుంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఈనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలే ప్రధాన భూమిక అయ్యే అవకాశం ఉంది.
మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో..
ఏ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిధిలో మహిళా ఓటర్లే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక వరాలు ప్రకటిస్తున్నారు. తీరొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు, ఇతర మహిళా సంఘాలకు పార్టీలపరంగా చేసిన మేలును గుర్తు చేస్తూ.. మహిళల కోసం ఆయా పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు..
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లు 10,83,175 మంది ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 5,31,515 మంది, మహిళా ఓటర్లు 5,51,584 మంది, ఇతరులు 76 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,096 మంది అధికంగా ఉన్నారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మహిళా ఓటర్లే ఎక్కవగా ఉన్నట్లు తేలింది.
ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించే సమయంలో సైతం ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడంతో ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయ్యారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటర్ల వివరాలు ఇలా
నియోజకవర్గం | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు | ఇతరులు | మొత్తం |
ఖమ్మం | 1,41,672 | 1,51,896 | 32 | 2,93,600 |
పాలేరు | 1,05,736 | 1,10,885 | 01 | 2,16,622 |
మధిర | 1,03,009 | 1,07,342 | 07 | 2,10,358 |
వైరా | 90,281 | 93,001 | 04 | 1,83,286 |
సత్తుపల్లి | 1,13,921 | 1,16,501 | 04 | 2,30,426 |
కొత్తగూడెం | 1,11,440 | 1,17,142 | 15 | 2,28,597 |
అశ్వారావుపేట | 73,466 | 76,736 | 03 | 1,50,205 |
Comments
Please login to add a commentAdd a comment