ఎంతో ఘన చరిత కలిగినదిగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పేరొందింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ స్థానం నుంచి హేమాహేమీలు పోటీ చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రులనే ఎగువ సభకు పంపినవారిగా, వరుసగా పలువురిని గెలిపించిన వారిగా..కేంద్ర మంత్రులుగా చక్రం తిప్పేలా పట్టం కట్టిన వారిగా జిల్లా ప్రజలు చైతన్యవంతులనే గుర్తింపునొందారు. వివిధ పార్టీల వారిని గెలిపిస్తూ..విభిన్న తీర్పుతో సరికొత్త మార్పులకు మన జనం జై కొట్టారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ దురంధరులు అనేకమంది వివిధ పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వీరిలో ముగ్గురికి కేంద్రంలో మంత్రి పదవులు వరించగా, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఖమ్మం ఎంపీలుగా ఎన్నుకున్న ఘనత ఈ నియోజకవర్గ ప్రజలకే దక్కింది.
కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రజా సమస్యలపై తమదైన వాణిని వినిపించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములైన ఘనత ఈ ప్రాంత ఎంపీలకే దక్కింది.
1957లో ఆవిర్భవించిన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ప్రతి ఎన్నికకు ఒక విశిష్టత, విశేషం కనిపిస్తుంది. ఒకే పార్టీ నుంచి.. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ సొంతం చేసుకోగా..వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జలగం కొండలరావులు దక్కించుకున్నారు.
అలాగే కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి సైతం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్‌రావులు సుదీర్ఘ కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచే ఆయా సందర్భాల్లో పోటీచేయడం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రులుగా నిలిచిపోయారు.
- జలగం వెంగళరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనకంటూ ప్రత్యేక ఒరవడి, రాజకీయ శైలి ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి..ఆయా ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఖమ్మం లోక్‌సభ నుంచి 1984లో ఎంపీగా ఎన్నికై అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రాజకీయ చక్రం తిప్పారు.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన 27 సంవత్సరాల తర్వాత జిల్లాకు కేంద్ర మంత్రి పదవి జలగం వెంగళరావు రూపంలో దక్కింది. జలగం వెంగళరావు 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత 1984 వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
1984లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మరణించడం, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జలగం వెంగళరావు ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో ఏర్పడిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.
1989లో సైతం జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఎంపీగానే కొనసాగారు. కేంద్ర పరిశ్రమల మంత్రిగా కొనసాగుతూనే ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.
- నాదెండ్ల భాస్కరరావు
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్‌రావు 1998లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కేవలం సంవత్సర కాలం మాత్రమే ఎంపీగా కొనసాగారు.
- పీవీ.రంగయ్య నాయుడు
1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటి ఐపీఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న పీవీ.రంగయ్యనాయుడును ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఆయన గెలిచి ప్రధానమంత్రి పీవీ.నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర టెలికమ్యూనికేషన్లు, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో ఆయన రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రంగయ్యనాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజయం సాధించారు.
- గారపాటి రేణుకాచౌదరి
1999, 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి రేణుకా చౌదరి విజయం సాధించారు. కేంద్రంలో ఏర్పడిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె రెండు పర్యాయాలు స్త్రీ, శిశు సంక్షేమ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు.
తీరొక్క పార్టీల నుంచి..
ఖమ్మం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీతో సహా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నేతలు పోటీ చేసి ఆయా సందర్భాల్లో ఎంపీలుగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. అత్యధిక సార్లు ఎంపీలుగా విజయం సాధించిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీకే దక్కింది.
ఖమ్మం లోక్‌సభ ఏర్పడిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత, పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన విఠల్‌రావు విజయం సాధించగా, దాదాపు 39 సంవత్సరాల అనంతరం మళ్లీ ఖమ్మం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసిన తమ్మినేని వీరభద్రం గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రమంతటా తెలంగాణ ప్రభంజనం కొనసాగుతున్నా..ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు.
ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు పర్యాయాలు 1962 నుంచి 1976 వరకు ఎంపీగా కొనసాగిన ఘనత లక్ష్మీకాంతమ్మకే దక్కింది. అలాగే ఖమ్మం శాసనసభ్యురాలిగా సైతం ఒక పర్యాయం పనిచేసి జిల్లాలో సుదీర్ఘకాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment