కాంగ్రెస్‌ కంచుకోటలో పాగా వేసేదెవరో? | Elections 2019 Khammam lok sabha Constituency Profile | Sakshi
Sakshi News home page

కోటలో మొనగాడు!

Published Sun, Mar 17 2019 7:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Elections 2019 Khammam lok sabha Constituency Profile - Sakshi

రాజకీయంగా చైతన్యవంతానికి మారుపేరు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి తొలి, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ఇక్కడి ప్రజలు పోషించిన పాత్ర చాలా కీలకం. 1952లో ఖమ్మం లోక్‌సభ స్థానం ఏర్పడగా, అప్పటి నుంచి చాలా రోజుల పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యే రాజకీయ వైరం నడిచింది. తొలుత పీడీఎఫ్, ఆ తర్వాత సీపీఐ, అనంతరం సీపీఎం, సీపీఐఎంఎల్‌ (న్యూడెమొక్రసీ) పార్టీలు ఇక్కడి ప్రజలను వామపక్ష ఉద్యమాల వైపు నడిపించాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఖమ్మం పార్లమెంటు పరిధిలో రాజకీయం కొంత మారుతూ వచ్చింది. కొన్నాళ్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోరాటం జరగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.

2014 ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో మాత్రమే విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బలం చేకూరింది. అయితే, లోక్‌సభ నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలంగానే ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటల కారణంగా 2018 ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలు గెలవలేకపోయింది. ఖమ్మం అసెంబ్లీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులు. కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడిపోయినప్పటికీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, టీజేఎస్‌ లాంటి పార్టీల బలం నామమాత్రమే. - మేకల కల్యాణ్‌ చక్రవర్తి 

కాంగ్రెస్‌కు కంచుకోట
1952లో ఖమ్మం లోక్‌సభ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుపొందారు. 1962 నుంచి 96 వరకు ఏకంగా 34 ఏళ్ల పాటు 8సార్లు వరుసగా కాంగ్రెస్‌ గెలిచింది. కాంగ్రెస్‌ నుంచి లక్ష్మీకాంతమ్మ మూడు సార్లు, జలగం కొండలరావు, వెంగళరావు, రేణుకాచౌదరి రెండుమార్లు చొప్పున గెలిచారు. పి.వి. రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు ఒక్కోసారి గెలుపొందారు. మొత్తం మీద 1952లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు, ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు... కాంగ్రెస్‌ ఓడిపోయింది. 

2014లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం
రాష్ట్రం విడిపోయాక జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు ఈ స్థానం పరిధిలోకి వచ్చే అశ్వారావుపేట, వైరా అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచింది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ఉద్దండులైన నామా నాగేశ్వరరావు, కె.నారాయణ (సీపీఐ)ను ఢీకొని విజయఢంకా మోగించారు. ఆయనతో పాటు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), బాణోతు మదన్‌లాల్‌ (వైరా) ఎమ్మెల్యేలుగా వైఎస్సార్‌ కాంగ్రె స్‌ గుర్తుపై గెలిచారు. ఆపై టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈసారి ఎవరు..?
అధికార టీఆర్‌ఎస్‌లోని అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్‌లో నెలకొన్న నైరాశ్యం, వామపక్షాల బలహీనతల నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ తరఫున ఎవరు పోటీచేస్తారనేది ఉత్కంఠను కలిగిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడంతో ఒక్క ఖమ్మం మినహా ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. వైరాలో సీపీఐ అభ్యర్థిపై కాంగ్రెస్‌ రెబెల్‌ స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఖమ్మంలో మాత్రం టీఆర్‌ఎస్‌ గెలిచింది. కానీ, లోక్‌సభ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనే దానిపై అన్ని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్‌టాపిక్‌.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసారి టికెట్‌ ఇవ్వకపోవచ్చని మొదట్లో ప్రచారం జరిగినా అభ్యర్థిత్వాల ఖరారు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొంత సానుకూలత కనిపిస్తోంది. ఆయనను కాదంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పోటీలో దించే అంశాన్ని కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. వీరిద్దరికి తోడు జిల్లాకే చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చే అంశం కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎవరయినా సీఎం కేసీఆర్‌ వ్యూహంపైనే ఇక్కడ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే, రాజేంద్రప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ కూడా పరిశీలిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్‌ నుంచి కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి, గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా సంస్థాగత బలాన్నే నమ్ముకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది.  సీపీఐ, సీపీఎంలు పొత్తు పెట్టుకుని సీపీఎం ఇక్కడి నుంచి పోటీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావులో ఒకరు బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ సీపీఐ పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. ఈసారి రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉండటంతో ఫలితం సానుకూలంగా ఉంటుందనే అంచనాలో ఆయా పార్టీల నేతలున్నారు. బీజేపీ నుంచి ఎస్‌. ఉదయప్రతాప్, కె.రవీందర్, జి.విద్యాసాగర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. వీరిలో అభ్యర్థి ఎవరయినా కమలనాథులు గెలుపును మాత్రం అందుకోలేరు.

వైవిధ్యభరితం.. భౌగోళిక స్వరూపం
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ స్వరూపం అటు భౌగోళికంగానూ, ఇటు రాజకీయంగానూ వైవిధ్యభరితం.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు నెలవైన ఖమ్మం మెట్టు మొదలు, అందమైన అటవీ ప్రాం తాలతో కూడిన అశ్వారావుపేట, సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం నియోజకవర్గాలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతం గ్రానైట్‌ పరిశ్రమకు పుట్టినిల్లు. ఇక్కడ∙తయారయ్యే టైల్స్, శ్లాబ్స్, స్టోన్‌లను జపాన్, అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు. సింగరేణి కాలరీస్, కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీఎస్‌), ఐటీసీ పేపర్‌ లిమిటెడ్‌ లాంటి పరిశ్రమలకు కూడా ఈ నియోజకవర్గం నెలవు.  మామిడి, జీడి, కొబ్బరి, నిమ్మ, అరటి, జామ, ఆయిల్‌పామ్‌ తోటలకు ప్రసిద్ధి. వరి, మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు, చెరకు పంటలను పండిస్తారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ, కిన్నెరసాని, మున్నేరు, ఆకేరు, వైరా నదులు ప్రధాన నీటి వనరులు. 

ఇద్దరు కేంద్ర మంత్రులు

ఖమ్మం లోక్‌సభ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కేంద్ర కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. 1991–96 మధ్య కాలంలో ఎంపీగా ఉన్న పి.వి.రంగయ్యనాయుడు  పి.వి.నరసింహారావు కేబినెట్‌లో టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి వనరుల మంత్రి. ఆయన తర్వాత 2004–09 మధ్య కాలంలో రేణుకాచౌదరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. ఈమె యూపీఏ–1 హయాంలోని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కూడా ఖమ్మం లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా గెలుపొందారు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement