Nara Lokesh: అవినీతిలో నాన్నారిని మించిపోయిన లోకేష్ | Nara Lokesh Exceeded Chandrababu In corruption And Violence Politics | Sakshi
Sakshi News home page

హింసా రాజకీయంలోనూ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు

Published Wed, Sep 6 2023 6:25 PM | Last Updated on Thu, Sep 7 2023 8:05 AM

Nara Lokesh Exceeded Chandrababu In corruption And Violence Politics - Sakshi

"నాన్న పుంగనూరులో నెత్తురు రాజేశారు. కొడుకు భీమవరంలో రక్త చరిత్ర రాశాడు. తండ్రీ కొడుకులకు ఐటీ అధికారులు నోటీసు లిచ్చారు. పరువు పోయిందన్న ఉక్రోషంలో పోలీసులపైనా రాజకీయ ప్రత్యర్ధులపైనా రాళ్లు, కర్రలతో దాడులు చేయించారు. తమ యాత్రలకు షోలకూ ప్రజల నుండి స్పందన లేకపోవడంతో ఆక్రోశంతో రగిలిపోతోన్న తండ్రీ కొడుకులు  ప్రజలనూ  నెత్తుటిగాయాలతో హింస పెట్టేస్తునర్నారు. ఎన్నికల బరిలో వరుస పరాజయాలు వెక్కిరించడంతో వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందన్న భయంతో నెత్తుటేరులు పారిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు.

ఆవు చేల్లో మేస్తోంటే.. దూడ డిజిప్లీన్‌తో గట్టున మేస్తుందా? 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలతో పేట్రేగిపోతూ ఉంటే.. ఆయన తనయుడు నారా లోకేష్ తండ్రి చూడని లోతులకు రాజకీయాలను తీసుకుపోతున్నారు. అవినీతిలో చంద్రబాబుకు ఏ మాత్రం తీసిపోనని ఐటీ వెలుగులోకి తెచ్చిన రూ. 118 కోట్ల లూటీ కేసులో చంద్రబాబుతో పాటు లోకేష్ పైనా సాక్ష్యాలతో సహా అభియోగాలు ఉన్నాయి. అంతకు ముందు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలోనూ నాన్నకు ఏమాత్రం తీసిపోకుండా కొడుకు  దోపిడీలో సత్తా చాటారు. అవినీతిలో  నాన్నలా ప్రయోజకుడైన లోకేష్  ఇపుడు హింసా రాజకీయాల్లోనూ నాన్న నుంచి నాలుగు పాఠాలు నేర్చుకున్నట్లే అనిపిస్తోంది.
చదవండి: ఐటీ నోటీసులతో కంటిమీద కునుకు కరవైన చంద్రబాబు

తన పర్యటనలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఉక్రోషంతో రగిలిపోయిన చంద్రబాబు నాయుడు పుంగనూరులో కిరాయి గూండాలను మించిన రౌడీ కార్యకర్తలను వెంటేసుకుని వచ్చి రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులు, తుపాకులను తమతో తెచ్చుకుని పథకం ప్రకారం హింసాయుత దాడులకు తెగబడిన రాక్షసాన్ని ఏపీ ప్రజలు మర్చిపోలేదు. అందులో నలభై ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబే స్వయంగా కార్యర్తలను రెచ్చగొట్టి.. పోలీసులు, పాలకపక్ష నేతలను ఉద్దేశించి తరమండి  నా కొడుకుల్ని.. కొట్టండి.. ఎవ్వరినీ వదలకండి అంటూ  ఎంత నీచంగా రెచ్చగొట్టారో  అంతా చూశారు.

చంద్రబాబు దర్శకత్వంలో టీడీపీ గూండాలు చేసిన దాడిలో ఒక కానిస్టేబుల్ కంటి చూపు పోగా పదుల సంఖ్యలో పోలీసులు నెత్తుటి గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. పాలక పక్ష నేతలతో పాటు సామాన్య ప్రజలపైనా చంద్రబాబు దాడులు చేయించారు. తాజాగా చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్‌లు అమరావతిలో తాత్కాలిక భవనాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం ముసుగులో వందల కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా..ఫేక్ ఇన్ వాయిస్‌ల ద్వారా  కాజేసిన వైనాన్ని పిన్ పాయింటెడ్ గా ఐటీ అధికారులు సాక్ష్యాధారాలు చూపిస్తూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులతో  రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు చేసిన లూటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఒక పక్క లోకేష్ యువగళం యాత్రకు స్పందన లేదని  మండిపడుతోన్న టీడీపీ అధినేతకు  మరో పక్క ఐటీ నోటీసులతో తమ బండారం బట్టబయలు కావడం  మరింత కాక రేపింది. జనం దృష్టిలో తమ దొంగతనాలు వెలుగులోకి వచ్చేశాయని అర్ధం కావడంతో ఇక తమకి జనం విలువ ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు అండ్ కో. ఈ నేపథ్యంలోనే ఐటీ నోటీసులను దారి మళ్లించడానికి చంద్రబాబు సూచనల మేరకే  నారా లోకేష్ భీమవరంలో  పోలీసులపైనా, పాలక పక్ష కార్యకర్తలపైనా దాడులకు తమ కార్యకర్తలను రెచ్చగొట్టారు.

పుంగనూరు తరహాలోనే భీమవరంలోనూ టీడీపీగూండాలు ముందస్తుగానే రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలు తమతో తీసుకు వచ్చారు. ఒక పథకం ప్రకారమే పోలీసులనూ ప్రజలనూ రెచ్చగొడుతూ బూతులు తిడుతూ దాడులకు ప్రేరేపించారు లోకేష్. వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, టూటౌన్ కానిస్టేబుల్ రమేష్‌తో పాటు మరో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతర పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరికి భీమవరం ప్రభత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

చంద్రబాబు హింసా రాజకీయాలను ఉమ్మడి ఏపీ హయాం నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే వచ్చారు. తన హింసా వారసత్వాన్ని తన కుమారుడు లోకేష్‌కు  అప్పగించాలనుకున్నారో ఏమో కానీ.. ఇపుడు ఆ నెత్తుటి క్రతువులోనూ కొడుక్కి శిక్షణ ఇస్తున్నారు చంద్రబాబు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని  నాశనం చేసి  నెత్తుటి చరిత్ర రాసుకుపోతున్నారు.
-యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement