సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టుతో బెంబేలెత్తుతున్న ఆయన తనయుడు నారా లోకేశ్ రాష్ట్రానికి వచ్చేందుకు జంకుతున్నారు. కుంభకోణాల్లో తనను అరెస్టు చేస్తారనే భయంతో పది రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన చినబాబు పరిస్థితి ఎక్కే గడప దిగే గడపగా తయారైంది.
ఒకవైపు అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడుతున్న అధికార పక్షం, మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ తిరస్కృతి పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా లోకేశ్ మాత్రం ఢిల్లీని వదలడం లేదు. క్యాడర్‌కు మనోధైర్యంఇచ్చేందుకు రాష్ట్రానికి రావాలని ఒత్తిళ్లు వస్తున్నా లోకేశ్ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.
పట్టించుకోని పార్టీలు..
చంద్రబాబు అరెస్టు, అనంతరం పరిణామాలను జాతీయ మీడియా, నేతలకు ఢిల్లీ వేదికగా చాటిచెబుతానంటూ ప్రత్యేక విమానంలో ఈనెల 14న ఢిల్లీ చేరుకున్న లోకేశ్ తొలి రెండు రోజులు కొంత హడావుడి చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఒకట్రెండు జాతీయ ఛానళ్లు మినహా మీడియా లోకేశ్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నీరుగారిపోయిన చినబాబు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో సమావేశం అంటూ మరో నాలుగు రోజులు వెళ్లదీశారు. చంద్రబాబుకు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే యత్నాలు బెడిసికొట్టాయి.
ఒకరిద్దరూ జాతీయ పార్టీ నేతలతో తమ ఎంపీలు ఎలాగోలా సమావేశాలను నిర్వహించినా వారు వేసిన ప్రశ్నలతో లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అయినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో దిట్టగా పేరుపొందిన చంద్రబాబు ఎప్పుడో జైలు కెళ్లాల్సిందన్న వ్యాఖ్యలు జాతీయ పార్టీ నేతల నుంచి వినిపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో తాము నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉందని ఎంపీలు మొత్తుకున్నా లోకేశ్ మాత్రం సోమవారం వరకూ ఉండాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తాజాగా హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ లోకేశ్ ఢిల్లీని వీడినా నేరుగా హైదరాబాద్‌కు వెళ్లే అవకాశాలే ఎక్కువని, ఏపీకి వెళ్లడం ఇబ్బందేనని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment