ముంబై: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. 2024లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల తన ‘మిషన్-2024’ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని పలువురు భావిస్తున్నారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన వీరి చర్చల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి ధీటైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై, అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ప్రతి రాజకీయ నేతనూ కలుస్తానని.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని, అందులో తప్పు లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
కాగా తాజాగా పీకే, పవార్ భేటీపై ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘శరద్ పవర్‌ను శుక్రవారం ప్రశాంత్ కిషోర్ మర్యాద పూర్వకంగానే ఇంట్లో కలిశారు. దాదాపు ఈ సమావేశం మూడు గంటలు సాగింది. అయితే ఇందులో ఎన్సీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకునే చర్చ ఏం జరగలేదు. అతను ఒక వ్యూహకర్త. అతను విషయాలను వేరే విధంగా విశ్లేషిస్తాడు. తన అనుభవాన్ని పవర్ సాబ్‌తో పంచుకున్నారు. పవర్ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేకంగా బలమైన రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని పవర్ కోరుకుంటున్నారు. ఆ దిశగానే ఎన్‌సీపీ పనిచేస్తోంది’ అని నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో స్థానిక నాయకులను తమ పార్టీలో చేరమని బీజేపీ నాయకులు బెదిరించారని అందుకే ప్రజలు బీజేపీని తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరారని, బెంగాల్‌లో టీఎంసీలో ఇంకా చేరాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీల జాబితా ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ వ్యూహరచయితగా వ్యవహరించిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం తాను ఏ రాజకీయ పార్టీకి కూడా పనిచేయనని ప్రశాంత్ తేల్చి చెప్పారు.
చదవండి: పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024
Comments
Please login to add a commentAdd a comment