సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పటాన్‌చెరు టికెట్ పంచాయితీ ఇంకా పరిష్కారం కాలేదు. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో తన పేరు ఉండడంతో బీఫారం తీసుకునేందుకు నీలం మధు ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఏఐసీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని, స్పష్టత వచ్చిన తర్వాత బీఫారం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చెప్పారు. దీంతో మధు అనుచరులు కొంతసేపు గాంధీభవన్‌లో హడావుడి చేశారు. టికెట్ ప్రకటించి బీఫాం ఎందుకు ఇవ్వరంటూ ఆందోళన నిర్వహించారు.
ఈ టికెట్ విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గట్టి పట్టు పడుతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన విధంగా మధుకు కాకుండా తన సన్నిహితుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీలో మకాం వేశా రు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు.
వాస్తవానికి బుధవారమే ఆయన నామినేషన్ వేయాల్సి ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. తనకు జ్వరం వచ్చినందున బుధ, గురువారాల్లో నిర్ణయించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నానని, ఈనెల 10న తాను నామినేషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. అయి తే, మధుకు బీఫాం ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారని, ఈ కోణంలోనే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
సంగిశెట్టి, సలీం రాజీనామా
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ముషీరాబాద్ టికెట్ ఆశించిన సంగిశెట్టి జగదీశ్వర్‌రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో బీసీలకు అన్యాయం చేసినందున తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మైనార్టీ నేత సలీం కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు.
కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాం«దీభవన్‌కు వచ్చిన ఆయనకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు బోసురాజు, గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, నవీన్ భార్యకు తుంగతుర్తి టికెట్ కేటాయించనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు
బుధవారం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయమే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment