యూత్‌ ఎంట్రీ.. ఎవరికి ఎగ్జిట్‌?.. అసలు ఏం జరుగుతోంది? | New Generation Leaders Enters Ranga Reddy District | Sakshi
Sakshi News home page

యూత్‌ ఎంట్రీ.. ఎవరికి ఎగ్జిట్‌?.. అసలు ఏం జరుగుతోంది?

Published Fri, Mar 10 2023 6:26 PM | Last Updated on Fri, Mar 10 2023 7:49 PM

New Generation Leaders Enters Ranga Reddy District - Sakshi

రంగారెడ్డి జిల్లాలో కొత్త తరం నాయకులు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మంత్రులు తమ తనయులను బరిలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారా? ఎమ్మెల్యేలు తప్పుకుని వారసులకు ఛాన్స్ ఇస్తారా ? గులాబీ పార్టీతో పాటు.. కమలం పార్టీ కూడా వారసుల్ని బరిలో దించబోతోందా? అసలు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది?

మూడు ముక్కలు.. ఆరు వక్కలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలుగా విడగొట్టారు. పాలమూరు జిల్లా నుంచి షాద్ నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు.. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను రంగారెడ్డిలో కలిపేశారు. కోడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు.  మేడ్చల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డి కూడా కేసీఆర్ క్యాబినెట్ లో స్థానం పొందారు.

ఈ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో తనయులను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి 2014లోనే చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్తీక్ రెడ్డి .. అధిష్టానం తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి తన ఇద్దరు తనయులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇద్దరిలో ఒక్కరికైనా ఏదో ఒకచోట ఛాన్స్ ఇస్తారని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు.

లైన్‌లో మా వాడున్నాడు
ఇక అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం..తమ తనయులకు రూట్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి... ఇప్పటికే కొడుకు ప్రశాంత్ రెడ్డితో నియోజకవర్గమంతా పాదయాత్ర చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అని క్యాడర్ కు క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు.. తన తనయుడు రోహిత్ రావు ను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు రోహిత్ రావు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. తన తనయుడు రవి యాదవ్ కు వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. అయితే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి... షాబాద్ జడ్పీటీసీగా ఉన్న తన సోదరుడి కుమారుడు పట్నం అవినాశ్ రెడ్డిని షాద్ నగర్ లో పోటీ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

అందరిది అదే దారి
ఇక బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసులకే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మహేశ్వరం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని షాద్ నగర్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు రవి యాదవ్.. ఈ సారి టికెట్ దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారసుల్ని బరిలో దించగల పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీలు ఎవరెవరి వారసులకు ఛాన్స్ ఇస్తాయో చూడాలి.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement