సాక్షి, హైదరాబాద్: దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిన తెలంగాణ ఔన్నత్యాన్ని దేశం ముందు సగర్వంగా నిలిపేలా.. ప్రజలకు పాలన అత్యంత వేగంగా అందేలా.. ఆధునిక సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో కార్యాలయం ఒక్కోచోట ఉండి ఫైళ్లు కదిలేందుకు రోజుల సమయం పట్టే పరిస్థితిని మార్చుతున్నామని చెప్పారు.
వాన నీళ్లు కారుతూ, ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాల స్థానంలో.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు అంతా ఒకేచోట ఉండేలా సమీకృత సచివాలయం ప్రజల ముంగిటికి వస్తోందన్నారు. కొత్త సచివాలయం నిర్మాణ ఆలోచన మొదలు.. ప్రారంభోత్సవం దాకా కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్‌రెడ్డి గురువారం రాత్రి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే..
‘‘ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. అన్ని రాష్ట్రాలు మనవైపు చూస్తున్న తరుణంలో తెలంగాణ స్థాయికి తగ్గ సచివాలయ భవనం అవసరమని సీఎం కేసీఆర్ భావించారు. అసౌకర్యాలతో ఉన్న పాత సచివాలయ భవనాలు, మంత్రి ఓచోట, అధికారులు ఓచోట ఉండే అస్తవ్యస్థ పరిస్థితిని సరిదిద్దే ఆలోచన చేశారు. సచివాలయ భవనం ఎలా ఉండాలనే ప్లాన్ అంతా సీఎందే. ఆయన సూచనల మేరకే భవనం ఇంత అద్భుతంగా సిద్ధమైంది.
రాత్రింబవళ్లు కష్టపడి కేవలం 26 నెలల్లో దీనిని సిద్ధం చేశాం. పునాది రాయి వేసిన రోజే.. భవనానికి అవసరమైన సామగ్రి అంతటికి వెంటనే ఆర్డర్ ఇచ్చి సమకూర్చుకోవాలని.. అన్ని పనులను ఒకే ఏజెన్సీ ద్వారా చేయాలని కేసీఆర్ సూచించారు. దీనితో నిర్మాణంలో జాప్యం లేకుండా 26 నెలల్లో పూర్తయింది. లేకుంటే ఐదేళ్లకంటే ఎక్కువ కాలం పట్టేది.
విమర్శలను పట్టించుకోం
ఉన్న భవనాలను కూల్చికట్టారని, అనవసరంగా భారీ వ్యయం చేశారని, గుమ్మటాల నిర్మాణ శైలిని అనుసరించారని.. ఇలాంటి విమర్శలను పట్టించుకోం. ప్రజలకు పాలన ఫలితాలు వెంటనే అందేందుకు, తెలంగాణ ఔన్నత్యం ఇనుమడింపచేసేందుకు కొత్త సచివాలయం నిర్మించాం. దీనికి అయిన ఖర్చుతో పోల్చుకుంటే కొన్ని వందల రెట్లు ప్రజలకు మేలు జరగబోతోంది.
అంబేడ్కర్‌కు, అమరవీరులకు మధ్య..
ఇటీవలే ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆవిర్భావం కోసం అమరులైన వీరులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించుకున్నాం. దాన్ని జూన్ 2న ప్రారంభించనున్నాం. ఈ రెండింటికీ మధ్య కొత్త రాష్ట్ర ప్రధాన పాలనా భవనాన్ని నిర్మించుకున్నాం. ఈ నెల 30న ప్రారంభించుకోబోతున్నాం.
ఇక ఆస్పత్రులపై దృష్టి..
సచివాలయ భవనం ప్రారంభమయ్యాక.. ఆస్పత్రులపై దృష్టి పెట్టబోతున్నాం. త్వరలో 24 అంతస్తులతో అతి గొప్పగా, దేశం మొత్తం మనవైపు చూసేస్థాయిలో వరంగల్‌లో ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించుకోనున్నాం. దానితోపాటు హైదరాబాద్ నలుదిక్కులా కొత్త మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను సిద్ధం చేసుకుంటాం. కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో సాగు, తాగునీరు, కరెంటు లక్ష్యంగా ప్రణాళికలు అమలయ్యాయి. రెండో విడతలో విద్య, వైద్యం లక్ష్యాలుగా పాలన సాగుతోంది.
రీజనల్ రింగురోడ్డు విషయంలో కేంద్రం పేచీ
ఆర్‌ఆర్‌ఆర్‌ను పట్టాలెక్కించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ కావాలనే కేంద్రం పేచీ ధోరణితో వ్యవహరిస్తోంది. భూసేకరణ కాకుండానే 50% రాష్ట్ర వాటా డబ్బు కట్టాలని వింత వాదనకు దిగింది. ఏ ప్రాజెక్టులోనూ∙అలా ఉండదు. అయినా మంచి ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పేచీ వద్దని, అవార్డ్ పాస్ చేయకుండానే రూ.100 కోట్లు చెల్లించాలని సీఎం చెప్పడంతో నిధులు విడుదల చేశాం. ఆర్‌ఆర్‌ఆర్‌ను వేగంగా చేపట్టేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment