అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం అందలేదు. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే కూడా ఒకరు.
తనకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఠాక్రే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్దవ్ తన తల్లి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిర ఆలయం ప్రారంభోత్సవం రోజే తనతోపాటు తన పార్టీ నేతలు నాసిక్‌లోని కాలారామ్ ఆలయానికి వెళ్లి అక్కడ గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహించనున్నట్లు చెప్పారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన గర్వించదగ్గ విషయమని, ఆత్మగౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సానే గురూజీ నిరసనలు చేసిన కాలారామ్ సదర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తాం’’ అని ఠాక్రే చెప్పారు. కాగా రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని గతవారం ఉద్ధవ్ తెలిపిన విషయం తెలిసిందే.
రాముడు కొలువై ఉన్న కాలారామ్ ఆలయం నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో ఉంది. నల్లరాతితో చెక్కిన రాముడి విగ్రహం ద్వారా ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. రాముడు వనవాస సమయంలో భార్య సీత, సోదరుడులక్ష్మణుడితో పంచవటిలో ఉండేవారని భక్తులు విశ్వసిస్తారు. 1930లో దళితులను ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కాలారామ్ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు.
చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..
.
Comments
Please login to add a commentAdd a comment