18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి సెషన్‌లో మూడో రోజు బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ సమయంలో సభలో ఓ దృశ్యం తళుక్కున మెరిసింది. ఓం బిర్లాకు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఈ సమయంలో అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ అతని వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అఖిలేష్ మాట్లాడుతున్నంత సేపు ఆమె దృష్టి భర్తపైనే నిలిచింది.
అఖిలేష్ నూతన స్పీకర్ ఓం బిర్లాను అభినందిస్తూ.. కొత్త పార్లమెంటు- పాత పార్లమెంట్ అనే తేడాలు చూపిస్తూ మాట్లాడారు. కొత్త సభలో స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉందని, పాత పార్లమెంటులో కుర్చీ ఎత్తు తక్కువని అన్నారు. ‘స్పీకర్ సార్ మీకు అభినందనలు. మీకు స్పీకర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. మీకు పాత, కొత్త సభలతో పరిచయం ఉంది.
మీరు కూర్చున్న స్థానం ఎంతో విలువైనది. అద్భుత సంప్రదాయాలు కలిగినది. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని, వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు ప్రతీ ఎంపీకి, ప్రతీ పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని అనుకుంటున్నాం. నిష్పాక్షికత అనేది ఈ స్థానానికున్న ప్రధాన బాధ్యత. మీరు లోక్‌సభలో ప్రధాన న్యాయమూర్తి తరహాలో కూర్చున్నారు. ఎవరి గొంతునూ అణచివేయకూడదు. అలాగని ఎవరినీ బహిష్కరించకూడదు.
మీ నియంత్రణ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై కూడా ఉండాలి. మీ సూచనల మేరకు సభ నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా ఉండకూడదు. నేను మొదటిసారి సభకు వచ్చాను. మీ స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను..స్పీకర్ సార్’అని అఖిలేష్ అన్నారు. అఖిలేష్ సభలో మాట్లాడుతున్నంత సేపు అతని భార్య డింపుల్ చిరునవ్వులు చిందిస్తూ భర్తను చూస్తూనే ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా బుధవారం లోక్‌సభ స్పీకర్‌గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రొటెం స్పీకర్ (యాక్టింగ్ స్పీకర్) భర్తిహరి మహతాబ్ సభలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు తాత్కాలిక స్పీకర్ మహతాబ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment