ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆ పోస్టుకు ఎన్నిక జరగబోతోంది. ఇన్నేళ్లలో ఏకగ్రీవంగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి.
ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 294 మంది ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ తొలిసారి జరుగుతుండడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. మరోసారి లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లానే ఎన్డీయే కూటమి ఎంచుకుంది. స్పీకర్ పోస్టుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు.. ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగిస్తారని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ ఉదయం ఓం బిర్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో..
ఓం బిర్లా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే తీవ్రంగా యత్నించింది. బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్.. ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపారు. అయితే ఆనవాయితీగా వస్తున్న డిప్యూటీ స్పీకర్ పోస్టును ప్రతిపక్షాలకు వదిలేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలంతా ప్రతిపాదించారు. దీంతో.. మరోసారి ఫోన్ చేసి పిలుస్తామంటూ రాజ్‌నాథ్‌సింగ్ వాళ్లకు చెప్పారు.
అయితే డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార కూటమి తటపటాయించింది. ఈ క్రమంలో మరోసారి ఎన్డీయే నుంచి పిలుపు రాకపోవడంతో.. అభ్యర్థినే నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దీంతో దేశచరిత్రలోనే.. రేపు(జూన్ 26, 2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది.
No consensus on Speaker's post. INDIA bloc is likely to field its candidate for the post of Speaker of the 18th Lok Sabha: Sources pic.twitter.com/seZyieAIhS
— ANI (@ANI) June 25, 2024
ఇంతకు ముందు ప్రొటెం స్పీకర్ విషయంలోనూ కే.సురేష్ పేరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సురేష్.. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
నిన్న 280 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేయగా.. ఇవాళ మిగతా వాళ్లు చేస్తున్నారు. ఇక రేపు(జూన్ 26) స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సమక్షంలో ఎంపీలు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment